
BJP Vs DGP: తెలంగాణలో బీజేపీకి పోలీసులకు మధ్య కొన్ని రోజులుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. అధికార పార్టీ తీరు.. పోలీసులు కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. అధికార పార్టీ విషయంలో ఒకలా, విపక్షాలతో ఒకలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల టెన్త్ హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడం, వెంటనే దానికి కుట్రదారు బండి సంజయ్ అని అరెస్ట్ చేయడంతో పోలీసులు, బీజేపీ మధ్య గొడవ పెరిగింది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరుగా వరంగల్ సీపీ రంగనాథ్‌ను టార్గెట్ చేశారు. తాజాగా డీజీపీ అంజనీకుమార్‌కు వార్నింగ్ ఇచ్చారు.
అంధ్రాకు పంపిస్తాం..
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను ఏపీకి పంపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టారని.. ఈ కేసు విషయంలో ఇంతటితో వదిలి పెట్టబోమని హెచ్చరించారు. బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర పెద్దలు కూడా అగ్రహించారన్న ప్రచారం జరిగింది. తెర వెనుక ఏం జరిగిందో కానీ.. తెలంగాణ హైకోర్టులో కేంద్రం ఓ పిటిషన్ వేసింది. విచారణ పెండింగ్‌లో ఉన్న సివిల్ సర్వీస్ అధికారుల క్యాడర్ వివాదంపై పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని కోరింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను జూన్‌లో చేపడతామని హైకోర్టు తెలిపింది.
12 మంది బదిలీపై ఉత్కంఠ..
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ క్యాడర్‌కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరిలో తెలంగాణ ఇన్‌చార్జి డీజీపీ అంజనీకుమార్ కూడా ఉన్నారు. డీజీపీతోపాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై విచారణను తెలంగాణ హైకోర్టు కొన్నాళ్ల కిందట వాయిదా వేసింది. మళ్లీ విచారణకు రాకపోయేసరికి కేంద్రం త్వరగా విచారణ చేయాలని పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.

సోమేశ్‌లా పోక తప్పదా..
గతేడాది తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు మెరిట్ ప్రకారం చూస్తే అందరూ ఏపీకి వెళ్లాల్సి వస్తుందన్న అభిప్రాయ అధికారవర్గాల్లో ఉంది. అయితే విచారణను జూన్‌లో చేపడతామని హైకోర్టు చెప్పడంతో మరో రెండు నెలల వరకూ ఈ అంశంలో ఎలాంటి కదలిక ఉండకపోవచ్చు. కానీ ఈ అధికారుల్లో మాత్రం దడ ప్రారంభమవుతుంది. రాజకీయ పరమైన విషయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా దూకుడుగా వెళ్తే ఏమైనా జరగవచ్చన్న ఆందోళన వారిలో ఉంటుంది. బీజేపీ కచ్చితంగా ఇదే ఎఫెక్ట్ కోరుకుంటుందన్న అభిప్రాయం ఉంది.