
Haryana Murrah Breed Buffalo: పశువుల్లో వివిధ జాతులను బట్టి వాటి ఖరీదు ఉంటుంది. సాధారణంగా ఆవులు గేదెల ధరలు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అరుదైన జాతులు అయితే ఓ కోటి పలుకులుంది. కానీ ఇక్కడ దున్న ఖరీదు మాత్రం లక్షలు, కోట కాదు రూ.25 కోట్లు. గేదె అయితే పాలిస్తుంది కాబట్టి డిమాండ్ ఉందనుకోవచ్చు. దున్నకు అంత డిమాండ్ ఎందుకంటే అది అట్లాంటిట్లాంటి దున్న కాదు మరి. దానికో ప్రత్యేకత కూడా ఉంది. దాని వీర్యం అమ్మకం ద్వారానే నెలకు భారీగా ఆదాయం వస్తోంది. అదే హరియాణాకు చెందిన ముర్రాజాతి దున్నపోతు ‘షెహన్‌షా’.. దీనిముందు లగ్జరీ కార్ల విలువ కూడా దిగదుడుపే.
దాని వీర్యానికి విదేశాల్లో డిమాండ్..
హరియాణాకు చెందిన ముర్రాజాతి దున్నపోతు ‘షెహన్‌షా’ ధర అక్షరాలా రూ.25 కోట్లు. పానీపత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్రసింగ్ అనే రైతు ఈ మేలురకం దున్నపోతును పెంచుకొంటున్నారు. దీని ముద్దుపేరు ‘షెహన్‌షా’. వయసు పదేళ్లు. పొడవు 15 అడుగులు.. ఎత్తు ఆరడుగులు. ఈ దున్నల వీర్యానికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. నెలలో నాలుగుసార్లు షెహన్‌షా వీర్యాన్ని బయటకు తీస్తారు. ఆ వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారు. వీటిని వేరు చేసే ప్రక్రియలో ప్రతీ డోసుకు రూ.300 వరకు ఖర్చవుతుంది. అనంతరం దీనిని మార్కెట్‌లో విక్రయించి నెలకు రూ.9.60 లక్షలు నరేంద్రసింగ్ ఆర్జిస్తున్నారు.
నల్ల బంగారం..
హరియాణాకు చెందిన ముర్రాజాతి గేదెలు, దున్నలను నల్ల బంగారాలు అని పిలుస్తారు. కర్నాల్ నగరం వీటికి ప్రసిద్ధి. ‘షెహన్‌షా’ జీవనశైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నరేంద్రసింగ్ దీని కోసం ఓ ప్రత్యేక ఈతకొలను కట్టించారు. ఈ దున్న వివిధ పోటీల్లోనూ విజేతగా నిలుస్తోంది. ఓ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా రూ.30 లక్షలు గెలుచుకుంది.

మేలుజాతి గేదెలు, దున్నల కోసం..
మేలుజాతి దున్నలు, గెదెల ఉత్పత్తి కోసం కొన్నేళ్లుగా పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. ఈ క్రమంలో మేలైన దున్నల నుంచి వీర్యం సేకరించి గెదెల గర్భంలో ప్రవేశపెడుతున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు అమలు చేస్తూ మరోవైపు ప్రయోగాలు చేస్తున్నారు. మేలైన సంతితో పాల ఉత్పత్తి పెరుగుతుంది. దున్నలైనే వ్యవసాయంతోపాటు విదేశాల్లో మాంసం కోసం విక్రయిస్తారు. దీంతో మేలు జాతి దున్నల వీర్యానికి డిమాండ్ పెరుగుతోంది.