Bandi Sanjay: తెలంగాణలో ఉద్యమాల గడ్డ కరీంనగర్. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన కరీంనగర్‌లో ఈసారి కాషాయ జెండా ఎగురబోతోందా.. ఇప్పటి వరకు మూడుసార్లు గెలిచిన మంత్రి గంగుల కమలాకర్‌కు షాక్ తప్పదా.. అంటే అవుననే అంటున్నారు ఓటర్లు. ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకునేందుకు ఇప్పటికే వివిధ సంస్థలు ప్రీపోల్ సర్వేలు చేశాయి. తాజాగా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ప్రకటించేందుకు సర్వేలు చేస్తున్నాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోల్ మేనేజ్‌మెంట్ చేసేవారే విజయం సాధిస్తారని తెలుస్తోంది. అయితే ఓ ప్రముఖ మీడియా సంస్థ కరీంనగర్‌లో నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో మాత్రం.. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈసారి కాషాయ జెండా ఎగురబోతోందట.
గంగులకు ఎదురుగాలి..
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ నాలుగేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో చేసిన అభివృద్ధి మినహా సొంతంగా ఒక్క పని కూడా చేయలేదన్న అభిప్రాయం కరీంనగర్ ఓటర్లలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవల ప్రారంభించిన తీలగ వంతెన ప్రారంభించిన మూడు నెలలకే పగుళ్లుబారడం బీఆర్‌ఎస్ అవినీతికి నిదర్శనమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు.
పెరిగిన అరాచకాలు..
ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లు.. గంగుల కమలాకర్ స్థానికులకు అందుబాటులో ఉన్నారు. మంత్రిగా అయిన తర్వాత మంత్రి అనుచరుల అరాచకాలు పెరిగిపోయాయి. కార్పొరేటర్లు అయితే ‘కె’ ట్యాక్స్ పేరుతో ఇళ్లు నిర్మించుకునేవారు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారి నుంచి నేరుగా వసూళ్లకు పాల్పడతున్నారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభుత్వ నిర్మాణాల పేరుతో ఇసుక, మట్టి దందా జోరుగా సాగుతోంది. ప్రతీ పనిలో తన అనుచరులకు వాటాలు, కమీషన్లు ఇవ్వడం కామన్ అయిపోయింది. మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో దిగవ మానేరు డ్యాం నుంచి మొరం టెండర్ పొందిన కాంట్రాక్టర్.. కార్పొరేటర్లకు రెండు లారీల్లో మొరం తరలించేందుకు మంత్రి ద్వారా అనుమతి ఇప్పించారని సమాచారం. దీంతో కార్పొరేటర్లు వేలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక భూకబ్జాలకు అయితే అంతే లేదు.. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ ఆక్రమించుకోవడం, స్థానికంగా అందుబాటులో లేనివారి ప్లాట్లు కబ్జా చేసి.. గొడవలు పెట్టి సెటిట్‌మెంట్లు చేయడం కామన్ అయిపోయింది. ఇందతా మంత్రికి తెలిసే జరుగుతున్నా.. అడ్డుకోకపోగా, ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి.
బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ముస్లింలు..
పెరుగుతున్న గులాబీ నేతల అరాచకాలతో ఇంతకాలం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న ముస్లింలు ఈసారి గంగులకు వ్యతిరేకంగా మారారు. ఈసారి గంగులను మార్చాలని తీర్మానం కూడా చేశారని తెలిసింది. అభ్యర్థుల విజయంలో ప్రతీసారి ముస్లింలు కీలకపాత్ర పోషిస్తారు. ఈసారి కరీంనగర్ ముస్లింలు కాంగ్రెస్‌కు సపోర్టు చేయాలని నిర్ణయించారట. దీంతో ఈసాగి గంగులకు ఎదురీత తప్పదని సర్వేలో తేలినట్లు సమాచారం.
‘బండి’కి అనుకూలం..
ఇక కరీంనగర్‌లో మారిన రాజకీయ సమీకరణలతో పరిస్థితులు బండికి అనుకూలంగా మారుతున్నాయి. మంత్రి ఆగడాలకు చెక్ పెట్టాలంటే బండికే సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు ఓటేసినా బీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతారని, గతంలో గంగుల కమలాకర్, కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ కలిసి పనిచేశారన్న అభిప్రాయం కరీంనగర్ ఓటర్లలో ఉంది. ఇక బండి సంజయ్ కేంద్రం కరీంనగర్‌కు కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులతోపాటు, రైల్వే వంతెన, వరంగల్–జగిత్యాల జాతీయ రహదారి మంజూరు వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప గంగుల రాష్ట్రం నుంచి రూపాయి కూడా అదనంగా తీసుకురాలేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రేషన్ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ కరీంనగర్‌లో కొత్తగా ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయించలేకపోయారన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక్క రేషన్‌కార్డు అయినా ఇప్పించారా అని సవాల్ చేస్తున్నారు. గుట్టలను తొలిచి, భూముల కబ్జాచేసి, టెండర్లలో కమీషన్ల పనేరుతో కోట్లకు పడగలెత్తిన గంగుల కమలాకర్‌ను మళ్లీ గెలిపిస్తే ఈసారి కరీంనగర్‌ను అమ్మేస్తాడని ఆరోపిస్తున్నారు. గంగుల బాధితులంతా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మారుతున్నారు. సామాన్యులను రాచి రంపాన పెడుతున్న బీఆర్‌ఎస్‌కు ఈసారి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.