కేంద్రం డబ్బిస్తే పంచుకుందామనా కేసీఆర్!

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ విమర్శలు కురిపించడం పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే తలింతా పంచుకుందామని కొందరు రాబందుల్లా ఎదురుచూస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని కేసీఆర్ చెప్పడాన్ని […]

Written By: Neelambaram, Updated On : May 20, 2020 11:05 am
Follow us on


ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ విమర్శలు కురిపించడం పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే తలింతా పంచుకుందామని కొందరు రాబందుల్లా ఎదురుచూస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని కేసీఆర్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం నేరుగా నగదు ఇస్తే తమ జేబులు నింపుకుందామనా? అభివృద్ధి పనుల పేరుతో కమీషన్లు దండుకుందామనా? అంటూ ప్రశ్నించారు. గతంలో ఇదంతా జరిగిందేమో….మోడీ సర్కార్ హాయాంలో ఇది సాధ్యం కాదని సంజయ్ స్పష్టం చేశారు.

పదిహేను రోజుల జీతాలకు కోత విధించిన కేసీఆర్ కు కేంద్రాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది? అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలు ఫ్యూడల్‌ విధానంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ అనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. భూస్వామ్య విధానం గురించి, ఫ్యూడల్ స్వభావం గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కేంద్రం డబ్బులు ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు. ఏమైనా అంటే రైతు బంధు ఇస్తున్నా అంటున్నాడని ధ్వజమెత్తారు. వ్యవసాయంలో రైతు బంధు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇంకేమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఇబ్బముబ్బడిగా రుణాలు తీసుకుని ప్రజలపై భారం మోపకుండా ఉండేందుకు ఎఫ్.ఆర్.బీ.ఏం చట్టం ఒక పరిమితిని విధించిందని గుర్తు చేశారు. అందుకే ఎఫ్ ఆర్ బీఎం విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

” అయినా ..మేము 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాం… నువ్వెన్ని కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తున్నావో చెప్పు?” అంటూ సంజయ్ సవాల్ చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒకవైపు ప్రధాని మోడీ ఆద్భుతంగా ప్రజల ఆదరణను చూరగొంటుంటే, ఇంకోవైపు కేసీఆర్ ప్రజల చీత్కారానికి గురవుతున్నారని దుయ్యబట్టారు.

తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకుల్లో కూడా అత్యంత ప్రజాస్వామిక దృష్టితో ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ ఎంత ఉపయోగకరమో….ప్రజలు రాబోయే రోజుల్లో తెలుసుకుంటారని సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.