Bandi Sanjay Padayatra: దక్షిణ భారత దేశంలో పాగా వేయాలన్న బీజేపీ కల సాకారం దిశగా తెలంగాణలో అధికారం దిశగా దూసుకుపోతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుకు అధిష్టానం బ్రేక్ వేసింది. ప్రజాసంగ్రామయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి మైలేజ్ తెస్తున్నారు ‘బండి’. ఇప్పటికే ఐదు విడదల యాత్ర పూర్తిచేశారు. పాదయాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈనెల 15న ఐదో విడత పాదయాత్రను పూర్తి చేసి వెంటనే ఆరో విడత పాదయాత్రను కొనసాగించాలని భావించారు. అయితే ఆరో విడత బండి సంజయ్ పాదయాత్రకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. యాత్ర ఆపాలని అధిష్టానం బండి సంజయ్ ఆదేశాలలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంక్రాంతిలోపే పాదయాత్రను పూర్తి చేయాలని భావించిన బండి సంజయ్ యాత్రను కొనసాగించ లేని పరిస్థితి ఏర్పడింది.
సంక్రాంతి తర్వాత బస్సు యాత్రకు ప్లాన్..
సంక్రాంతి వరకు పాదయాత్రను పూర్తి చేసి సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేపట్టాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. సంక్రాంతికి ముందే ఆరో విడత పాదయాత్రలో భాగంగా పది రోజుల పాటు బండి సంజయ్ పాదయాత్ర చేస్తారని ఐదో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇదే విషయాన్ని బండి సంజయ్ ప్రకటిస్తారని కూడా పార్టీ నేతలు చెప్పారు. అయితే బండి సంజయ్ ఆ ప్రకటన చేయలేదు. దీనికి కారణం అధిష్టానం బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టుగా సమాచారం.
సంస్థాగత నిర్మాణంపై దృష్టి..
తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతున్న విషయాన్ని గుర్తించిన అధిష్టానం.. సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీలపై ఫోకస్ చేయాలని రాష్ట్రశాకను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన పాదయాత్రకు బ్రేక్ పడిందని సమాచారం. మండలాల వారీగా బూత్ కమిటీల సమ్మేళనం ఏర్పాటు చేయాలని, జనవరి మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని భావిస్తున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పని చేయాలని బండి సంజయ్‌ను ఆదేశించింది.
బూత్ కమిటీలతో నడ్డా మాట్లాడే అవకాశం..
జనవరి 7వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలతో అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఇప్పటి నుంచే బూత్ కమిటీల సమ్మేళనానికి ఏర్పాట్లు చేయాలని సూచించింది. బూత్ కమిటీలతో నిర్వహించే అసెంబ్లీ సదస్సుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వర్చువల్ జాయిన్ అవుతారని, కమిటీలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టిన అధిష్టానం… ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రేపటి నుంచి కీలక సమావేశాలు…
ఇదే సమయంలో డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం, తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం హైదరాబాద్లో జరుగనుంది. అంతేకాదు సంక్రాంతి తర్వాత బండి సంజయ్ అసెంబ్లీల వారీగా పర్యటించాలని రోజూ మూడు అసెంబ్లీల చొప్పున సంస్థాగత అంశాలపై సమీక్ష చేయాలని, బూత్ కమిటీలను నేరుగా కలిసి మాట్లాడాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కూడా ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర దాదాపు నెల రోజుల పాటు నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్నారు.
ఫ్రిబ్రవరి తర్వాతే ఆరో విడత యాత్ర..
ఐదు విడతల పాదయాత్ర పూర్తిచేసిన బండి సంజయ్ ఆరో విడత పాదయాత్రకు కాస్త టైం పడుతుందని భావిస్తున్నారు. ఏదిఏమైనా అధిష్టానం పాదయాత్ర లో వచ్చిన జనం మద్దతును చూసి, అదే ఓటు బ్యాంకు అని భ్రమపడి నేల విడిచి సాముచేయొద్దని బండి సంజయ్‌కు సూచించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించిన క్రమంలోనే బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ వేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఆరో విడత పాదయాత్ర ఫిబ్రవరి తర్వాతే ఉంటుందని కమలనాథుల టాక్.
c