
Bandi Sanjay Tour: రాష్ట్రంలో రాజకీయాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ఇన్ని రోజులు పరస్పర విమర్శలు, ఆరోపణలే వరకే పరిమితమైన రాజకీయాలు.. ఇప్పుడు దాడుల వరకు వెళ్లింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి, రైతులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర సోమవారం ప్రారంభమైంది. ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఈ యాత్రను ప్రారంభించారు. మొదటి రోజు నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించేందుకు బండి సంజయ్ వెళ్లారు. అక్కడ టీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. పోలీసుల వచ్చి ఇరు పార్టీల నాయకులను సర్దిచెప్పారు. మిగితా చోట్ల కూడా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇలా మొదటి రోజు ఘర్షణలు, ఆందోళన మధ్య యాత్ర ముగిసింది.
దాడికి కేసీఆరే కారణం- బండి సంజయ్
తనపై దాడికి సీఎం కేసీఆరే కారణమని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రైతు కష్టాలు తెలుసుకుందామని వస్తే ఇలా దాడులు జరిపించడం సిగ్గు చేటని అన్నారు. రైతుల కోసం తాను ఎక్కడికైనా పోతానని తెలిపారు. దసరాకు పది రోజుల ముందు నుంచే రైతులు కల్లాల్లో ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ఒక రైతు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.
వడ్ల చుట్టే తిరుగుతున్న రాజకీయాలు..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వడ్ల చుట్టే తిరుగుతున్నాయి. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిజానికి వడ్ల కొనుగోలుకు సంబంధించి, వినతులు, లేఖలు, ఒప్పందాలు అన్ని సెప్టెంబర్‌లోనే జరిగిపోయాయి. ఈ విషయం రెండు పార్టీలకు క్లారిటీ ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వడ్లను కొనవద్దని చెబుతోందని టీఆర్ఎస్ చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి వడ్లను అమ్మబోమని ఒప్పందం పత్రం రాసిచ్చిందని బీజేపీ చెబుతోంది. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య యుద్దమే జరుగుతోంది. వడ్లు కొనుగోలు చేయాలంటూ రెండు పార్టీలు ఇటీవల ధర్నా నిర్వహించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ ధర్నా నిర్వహించడం చాలా అరుదు. ఇలాంటి ఘటన అప్పట్లో ఢిల్లీలో చోటు చేసుకుంది. పాలనలో అడుగడుగునా అడ్డుకుంటున్నారంటూ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ అద్మీ పార్టీ నిరసనలకు దిగింది. ఆ నిరసనల్లో స్వయాన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అయితే తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి. ఏది ఏమైనా వరి విషయంలో రెండు పార్టీలు స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నాయన్నమాట వాస్తవం. ఇకనైన రైతులకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రెండు పార్టీలపై ఉంది.
Also Read: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ