Bandi Sanjay KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేసీఆర్ ఒక చెల్లని రూపాయి అని.. ఎవరూ దేకడం లేదని.. కేసీఆర్ కు ఫ్రస్టేషన్ ఎక్కువైందని.. ఏం మాట్లాడుతున్నరో అర్ధం కావడం లేదని విమర్శించారు. నువ్వు నశం పెడితే.. మేం జండూబామ్ రాస్తామని ఏకిపారేశారు. కేసీఆర్ భాషలో తెలంగాణ మాండలికంలో బండి సంజయ్ పేల్చిన డైలాగులు బాగా పేలాయి. సభలో రాజ్యాంగాన్ని తిరగరాస్తానన్న వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెబుతారేమో… బుద్ది వచ్చిందేమో అనుకున్న. కానీ అందుకు భిన్నంగా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పడానికే పెట్టినట్లుంది… ప్రజలు శిరసావహించాల్సిందేనని హెచ్చరించిండు.అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? తేల్చుకోవాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ చేశారు.

కేసీఆర్.. నువ్వేం పీకలేవు. ఉఫ్ అని ఊస్తావా? నీది గింత పార్టీ. ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీ బీజేపీ. మాడి మసైపోతవ్ అంటూ బండి విరుచుకుపడ్డారు. బహిరంగ సభలో మేం డ్రంకన్ డ్రైవ్ చేస్తాం. తాగినట్లు తేలితే… జైలుకు పంపతుం. ఆ స్కీం నీ కోసం కచ్చితంగా తీసుకొస్తానని బండి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవేంటో తెలుసుకుందాం..
• సీఎం సభ కు రెండ్రోజుల ముందు నుండే కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టారు. పోలీసుల సమక్షంలో దాడులు చేయిస్తున్నరు.
• లాఠీలకు, దాడులకు భయపడకుండా బయటకొచ్చి భారతమాతాకీ జై అంటూ జెండా పట్టుకుని వస్తున్న కార్యకర్తలను చూసి కేసీఆర్ గజగజ వణుకుతున్నరు.
• తెలంగాణలో పాలన ఇలాగే కొనసాగితే…. నిజాం పాలన మాదిరిగా కేసీఆర్ వస్తుంటే… చెప్పులు చేతుల్లో పట్టుకుని వంగి వంగి దండాలు పెట్టాలేమో…
• లేకుంటే వీపు చేస్తారేమో.. ఊరిడిచి వెళ్తారేమో..
• సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలి. డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి ఎంత మందికి ఇచ్చావో చెప్పాలి. సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి.
• కానీ నువ్వు చేసిందేమీ లేక… బీజేపీని టార్గెట్ చేయడానికే సభ పెట్టినట్లుంది.
• సీఎం సోయి లేకుండా మాట్లాడిండు…సోడాలో మందు పోసినట్లు మాట్లాడుతుండు.. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది.
• అవినీతి సామ్రాజ్యం కూలిపోతోంది.. విచారణ స్టార్ట్ అయ్యిందని ఆయనకు తెలిసిపోయింది. అందుకే తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తుండు.
• జైలుకు పోకుండా అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు..
• మోదీ మాటల్లో తప్పులేదు కాబట్టే నిన్న సభలో మాట్లాడలేకపోయిండు…
• బోర్లకు కరెంటు మీటర్లు పెడతానని కేంద్రం చెప్పిందా? అన్నీ అబద్దాలే. దుబ్బాక, హుజూరాబాద్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే చెప్పినా జనం నమ్మడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ అబద్దాలే చెప్పిండు.
• నేనడుగుతున్నా… మీటర్ల పెడతామని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా? దమ్ముంటే చూపించు… ఈరోజు డిస్కంలకు రూ.48 వేల కోట్ల అప్పులిచ్చిండు. అవి కట్టకపోతే భవిష్యత్తులో తెలంగాణ చీకటి మయమవుతుంది. రైతులకు ఉచిత కరెంట్ ఆగే ప్రమాదం.
• పెట్రోల్ పై ధరలను కేంద్రం తగ్గిస్తే… నువ్వేం చేసినవ్. నయా పైసా తగ్గించలే. 22 రాష్ట్రాలు తగ్గించినా నువ్వు మాత్రం లీటర్ కు రూ.40 లు దొబ్బిపోతున్నవ్. హుజూరాబాద్ లో నిన్ను చిత్తుగా ఓడించినా నీకు బుద్ది రాలేదు.
• తెలంగాణ ధనిక రాష్ట్రమే కదా… ఎందుకు పెట్రోలు ధరలు తగ్గించడం లేదు?
• నీ దరిద్రపు పాలనలో తెలంగాణను అప్పుల పాల్జేసినవ్. ఏనాడైనా సక్రమంగా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నవా? జీతాలివ్వలేకనే కదా.. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నవ్?
• రాబంధు నోట మళ్లీ దళితబంధు మాట వచ్చింది. హుజూరాబాద్ లో 20 వేల కుటుంబాలకు రూ.10 లక్షలు వేసినన్నవ్? ఏమైంది? అందరి ఖాతాల్లో డబ్బులు వేసినవా? నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే లబ్దిదారుల జాబితాతో పూర్తి వివరాలు వెల్లడించాలి.
• దళిత బంధు పేరుతో కన్ ఫ్యూజన్ చేయడానికే తప్ప ఏ ఒక్కరికీ లబ్ది చేకూరలేదు. ఎవరో ఒకరిద్దరికి డబుల్ బెడ్రూం, దళిత బంధు పథకాలు ఇవ్వడం… ఆ ఆశ చూపి ఓట్లు దండుకోవడం కేసీఆర్ కు బాగా అలవాటైంది.
• ఢిల్లీ కోటలు బద్ద కొడతడట.. కేసీఆర్ తీస్ మార్ ఖాన్. మోదీని చూస్తేనే వణుకుపుడుతంది. వెళ్లి వంగి వంగి దండాలు పెడతడు. సిగ్గుండాలి మాట్లాడటానికి.
• బలిదానాలు చేసిన పార్టీ అట.. సిగ్గులేదు.. టీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు బలిదానం చేసిండో చెప్పే దమ్ముందా? నీ కేబినెట్ లో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్లు ఎందరున్నారో చెప్పే దమ్ముందా?
• తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వాళ్లు, త్యాగాలు చేసిన వాళ్లంతా నీ కుట్రలకు బలైపోయిండ్రు. తెరమరుగైపోయిండ్రు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను కూడా కేసీఆర్ అవమానించిన చరిత్ర నీది…
• బలిదానాలు చేసిన పార్టీ బీజేపీది. 370 ఆర్టికల్ రద్దు కోసం శ్యామాప్రసాద్ బలిదానం చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం, దేశం కోసం బలిదానం చేసిన పార్టీ. నక్సలైట్లు చంపుతామని బెదిరిస్తామని హెచ్చరించినా… చనిపోయే సందర్భంలోనూ పారిపోకుండా భారత్ మాతాకీ జై అని నినదిస్తూ శ్వాస వదిలిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదే.
• ఈయనను ఇక్కడే ఎవడు దేకడం లేదు… డబ్బులు సంచులు పంపినా ఎవడూ పట్టించుకోవడం లేదు. తమిళనాడు, ఒరిస్సా, బెంగాల్ పోయి గుళ్లు గోపురాలు తిరిగి వచ్చిండే తప్ప ఎవడూ దేకలేదు. ఇక్కడికొచ్చి మళ్లా తీస్ మార్ ఖాన్ లెక్క చక్రం తిప్పుతనని కతలు చెబ్తుండు. నీ ముఖం చెల్లడం లేదు. నీది చెల్లని రూపాయి.
• రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహంతో దారి మళ్లించేందుకే డ్రామాలాడుతున్నరు.
• రాజ్యాంగంలోని ఒక్క పేజీ కూడా మార్చలేవ్. మార్చాలని చూస్తే మాడి మసైపోతావ్.
• మాది గుప్పుడె పార్టీనా? …. నువ్వు పెట్టిన జనగామలోనే సభ పెడతా… నీలెక్క బీరు, బిర్యానీ, రూ.500 లు ఇవ్వం. మా కార్యకర్తలు గర్జిస్తే చెవుల్లో రక్తం కారాలి. సభ పెట్టేది ఖాయం. మా దమ్మేందో చూపిస్తాం..
• బీజేపీకి పిడికెడు మంది లేకపోతే… అంత భయమెందుకు? ఎందుకు అడుగడుగునా అరెస్ట్ చేస్తున్నరు? ఎందుకు సభలో బెదిరిస్తున్నవ్? ఎందుకు టార్గెట్ చేస్తున్నవ్? మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నవ్…
• పోలీసులతో కొట్టిస్తున్నవ్? దాడులు చేయిస్తున్నవ్? కాళ్లు చేతులు విరిగినా సరే… భయపడే ప్రసక్తే లేదు… జనం కోసం ఎంతకైనా పోరాడేందుకు సిద్ధం.
• నీకు, నీ పార్టీ నాయకులకు దమ్ముంటే… పోలీసుల రక్షణ లేకుండా గ్రామాల్లో తిరిగి చూడు… జనమే మిమ్ముల్ని తరిమితరిమి కొడతారు.
• ఇప్పటికైనా సీఎం స్పందించాలి. 317 జీవోను సవరించాలి. నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. పంట చేతికొచ్చే సమయమైంది. ధాన్యం కొనేందుకు సిద్ధం కావాలి. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి. లబ్దిదారుల లిస్ట్ విడుదల చేయాలి.
• నీ అవినీతి సొమ్మును కక్కించేదాకా వదిలే ప్రసక్తే లేదు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లెక్క పారిపోదామనుకుంటున్నవేమో. దొంగ పాస్ పోర్టులు నీకు అలవాటే కదా… నీ ఆటలు సాగవ్… నిన్ను రాష్ట్రం వదిలి పోనీయ్యం. జైల్లో పెట్టడం ఖాయం.
• మోదీని ఎందుకు తరిమికొట్టాలి? లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకున్నందుకా? దేశానికి ఫ్రీ వ్యాక్సిన్ అందించినందుకా? 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసినందుకా? ఆత్మనిర్బర్ భారత్, మేక్ ఇన్ ఇండియాతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా? ప్రపంచంలోనే గొప్ప ప్రధానిగా పేరు తెచ్చుకున్నందుకా?
• అసలు నువ్వు చేస్తుందేమిటి? నీ భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నరు. నువ్వు మాట్లాడే బూతులు తెలంగాణ భాష కాదు.. నీ భాషను చూసి ఛీ..థూ అంటున్నరు. ఇకనైనా భాష మార్చుకో…
• తక్షణమే రాజ్యాంగాన్ని కించపర్చిన విషయంలో, తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడిన తీరుతోపాటు మోదీపై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దళిత బంధు, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల కల్పనలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
• 317 జీవోను సవరించాలని ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం… దాడులు చేయడం దారుణం. తక్షణమే అరెస్టు చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలి. గాయపడ్డ వారికి చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
• సింగరేణిలో 20 వేల ఉద్యోగాలు ఊడగొట్టిన సీఎంకు బీజేపీపై విమర్శలు చేసే అర్హత లేదు.
• మీడియా సమావేశంలో బండి సంజయ్ తోపాటు బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, రాష్ట్ర నాయకులు సీహెచ్. విఠల్, దరువు ఎల్లన్న, జె.సంగప్ప తోపాటు బీసీ, మైనారిటీ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, అఫ్షర్ పాషా తదితరులు పాల్గొన్నారు.