Talibans : అప్పుడు అమెరికాకు బుద్ధి వచ్చింది… ఇప్పుడు పాక్ కు బోధ పడుతోంది

Talibans : పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన కాటేయకుండా ఉండదు. విషాన్ని చిమ్మకుండా ఉండదు.. ఎందుకంటే దాని నైజమే అంత.. గతంలో సోవియట్ సైన్యంపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో కలిసి పోరాడేందుకు పాకిస్తాన్ గూడచారి సంస్థ ఐఎస్ఐ సృష్టించిన పాక్ తాలిబన్లు .. ఇప్పుడు దాయాది దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు.. పాక్ తాలిబన్లు తెహ్రీకే_ తాలిబన్ పాకిస్తాన్( టీటీపీ) కింద కార్యకలాపాలు సాగిస్తారు. ఈ ఏడాది ఆగస్టులో పాకిస్థాన్ భూ భాగం నుంచి వచ్చిన అమెరికన్ డ్రోన్ […]

Written By: Bhaskar, Updated On : December 30, 2022 9:09 pm
Follow us on

Talibans : పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన కాటేయకుండా ఉండదు. విషాన్ని చిమ్మకుండా ఉండదు.. ఎందుకంటే దాని నైజమే అంత.. గతంలో సోవియట్ సైన్యంపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో కలిసి పోరాడేందుకు పాకిస్తాన్ గూడచారి సంస్థ ఐఎస్ఐ సృష్టించిన పాక్ తాలిబన్లు .. ఇప్పుడు దాయాది దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు.. పాక్ తాలిబన్లు తెహ్రీకే_ తాలిబన్ పాకిస్తాన్( టీటీపీ) కింద కార్యకలాపాలు సాగిస్తారు. ఈ ఏడాది ఆగస్టులో పాకిస్థాన్ భూ భాగం నుంచి వచ్చిన అమెరికన్ డ్రోన్ కాబుల్ లో ఆల్ ఖయిదా అధినేత జవహరి ని మార్చింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లోని కైబర్ పఖ్తున్ క్వా, బలూచిస్తాన్ రాష్ట్రాల్లో వేర్పాటు వాద ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ సరిహద్దురేఖను ఆఫ్గాన్ తాలిబన్లు అంగీకరించడం లేదు. దీనివల్ల పశ్తూన్ ప్రాంతం పాకిస్తాన్ పరిధిలోకి పోయిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది.. అది మాకే చెందాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు.. అంతేకాదు రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు కంచెను తొలగిస్తున్నారు. దీనికి మరమ్మతు చేయాలని పాకిస్తాన్ ప్రయత్నించగా… ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పాకిస్తాన్ పౌరులు మరణించారు.. నవంబర్ లోనూ అక్కడ ఇదే స్థాయిలో ఘర్షణ చెలరేగింది.

-ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని..

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తన చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరసాన్ వంటి ఉగ్రముఠాలను ఉసిగొలుపుతున్నది.. దీనికి ప్రతిగా అప్ఘాన్ మద్దతు గల టీటీపీ పాక్ లో ఉగ్రదాడుల పరంపర చేపట్టింది. అంతేకాదు ఆ సంస్థ అధినేత మెహసూద్ ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేశారు. కార్యకర్తలను నడిపిస్తున్నారు.. అంతేకాదు ఇటీవల ఇస్లామాబాద్ లో పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద కారులో బాంబు పేల్చారు.. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి, పదిమంది ఇతరులు గాయపడ్డారు.. అంతేకాదు పాకిస్తాన్ లో విదేశీ దౌత్యవేత్తలు సమావేశమయ్యే మారియట్ హోటల్ పైన దాడులు చేసేందుకు రూపకల్పన చేసినట్టు వార్తలు వచ్చాయి.. దీంతో ఇతర దేశాలు తమ దౌత్య వేత్తలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి. 2008లో ఇదే హోటల్ పైన బాంబుదాడి జరిగితే 24 మంది మరణించారు.. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు ఇస్లామాబాద్ వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

-టీటీపీ ధ్యేయం మరొకటి

పాక్ ప్రభుత్వాన్ని కూలదోసి ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా షరియా ఆధారిత ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేయాలనేది టీటీపీ ప్రధాన ధ్యేయం.. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాకిస్థాన్ లో టీటీపీ దాదాపు 500 మందిని హతమార్చింది. వారిలో అత్యధికులు పాకిస్తాన్ భద్రతా సిబ్బందే.. డిసెంబర్ ప్రారంభంలో టీటీపీ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బన్నూ లో పాక్ ప్రభుత్వ ఉగ్రవాద వ్యతిరేక పోరాట కేంద్రంపై దాడి చేసి పలువురు పోలీసులను బందీలుగా పట్టుకున్నారు.. వారిని విడిచిపెట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వం డిమాండ్ చేసినప్పటికీ ఉగ్రవాదులు తలవంచలేదు. తమను స్వేచ్ఛగా ఆఫ్గనిస్తాన్ వెళ్ళనిస్తేనే వారిని విడిచిపెడతామంటూ పాకిస్తాన్ అధికారులను డిమాండ్ చేశారు.. అయితే వారికి నచ్చ చెప్పాలని పాక్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కోరినా కనీస స్పందన రాలేదు.. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న పాకిస్తాన్ కమాండోలు బన్నూ పై దాడి చేసి 25 మంది టీటీపీ ఉగ్రవాదులను హతమార్చి, బందీలను విడుదల చేశారు.. అంతేకాదు డిసెంబర్ మొదట్లోనూ కాబూల్ లో పాకిస్తాన్ రాయబార కార్యాలయం పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనల ఆధారంగా చూస్తే పాక్ లో తమ రాజ్యం ఏర్పాటు చేయాలని తాలిబన్లు బలంగా కోరుకుంటున్నారు. అందుకే పాకిస్తాన్ ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. పాక్ కు కూడా ఈ శాస్తి జరగాల్సిందే.. గతంలో అమెరికా కూడా ఇలానే చేసింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఘటన జరిగిన తర్వాత కానీ దానికి బుద్ధి రాలేదు.