Difference Between Modi And Sonia: రాజకీయ నాయకుల పదవీకాంక్షతో ఎన్నెన్నో మాట్లాడతారు. ఎన్నో వ్యూహాలు పన్నుతారు. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటారు. అవసరమైతే తమరాజకీయ ఉన్నతికి ఉపయోగపడిన పార్టీని, పార్టీ అధినేతలను సైతం ఎదురిస్తారు. అయితే ఒక్కోసారి అది వర్కవుట్ అవుతుంది. కొన్నిసార్లు మాత్రం వ్యూహం తప్పి రెండింటికీ చెడ్డ రేవడిగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులాంనబీ ఆజాద్ విషయంలో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది. ఆయన గత కొన్నేళ్లుగా జీ23 పేరిట కాంగ్రెస్ పార్టీలో స్వపక్షంలో విపక్షం అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు. అసమ్మతి నాయకులతో కూటమి కట్టి మరీ కాంగ్రెస్ నాయకత్వంపై గట్టి పోరాటమే చేశారు. నాయకత్వ మార్పిడికి డిమాండ్ చేశారు. నేరుగా అధినేత్రి సోనియాతో ఢీ అంటే ఢీ అన్న కోణంలో పోరాడారు. అయితే ఇన్నాళ్లకు ఆయనకు తత్వం బోధపడినట్టయ్యింది. వెంటనే రూటు మార్చారు. అధినేత్ర సోనియాకు మద్దతుగా మాట్లాడారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ సోనియా గాంధీని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించి ఆజాద్ యుద్ధంలో కూడా మహిళలకు మినహాయింపు ఇస్తారు. అటువంటిది వయసు మీద పడిన ఓ మహిళా నాయకురాలిని కేసుల పేరిట వేధింపులకు గురిచేయడం తగునా అని ప్రశ్నించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను విచారణ పేరిట తిప్పుకోవడం దారుణమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినంత పనిచేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదంటూ పేర్కొన్నారు. అయితే ఇన్నాళ్లు కాంగ్రెస్ అధినేత్రిపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నా ఆజాద్ ఏనాడు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ విధానాలను తప్పు పట్టలేదు. ఇన్నాళ్లకు నోరు మెదపడం చర్చనీయాంశంగా మారింది.

కొన్నేళ్లుగా స్వపక్షంలో విపక్షంలా…
అయితే గత కొన్నేళ్లుగా గులాంనబీ ఆజాద్ వ్యవహార శైలి ఇంటా, బయటా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ నేతగా, యూపీఏ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర వహించారు. అగ్రనాయకుల్లో ఒకరిగా ఎదిగారు. కానీ గత ఏడాది ఆయన రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ఆజాద్ పై ప్రశంసలు కురిపించారు. ఉత్తమ నాయకుడిగా కొనియాడారు. సభలో నిబద్ధత, బాధ్యత కలిగిన నాయకుడిగా మెసులుకున్నారని అభినందించారు. ఏనాడూ ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం చూడలేదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా సభలోకి కొత్తగా వచ్చిన వారు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సైతం సూచించారు. దీంతో దేశ రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. ఆజాద్ మైనార్టీకి చెందిన నేత కాబట్టి ఆయనకు రాష్ట్రపతి కానీ.. ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెడతారని రాజకీయ విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో కొత్త పల్లవిని అందుకున్నారు. నాయకత్వ మార్పిడిని తెరపైకి తెచ్చారు. తద్వారా మోదీ ప్రేమను మరింతగా పొందాలని భావించారో ఏమో కానీ దూకుడు పెంచారు. అటు ప్రధాని మోదీ బయట సమావేశాల్లో సైతం ఆజాద్ ప్రస్తావన తెచ్చేవారు. దీంతో ఆజాద్ కు కేంద్రంలో కీలక పదవి దక్కుతుందని అందరూ భావించారు.
Also Read: Samantha: చైతన్యతో ఉన్న ఇంటినే మళ్లీ కొని ఉంటున్న సమంత.. అసలేమైంది? కారణమేంటి?
సీన్ రివర్స్…
కానీ ఏడాది తిరిగే సరికి సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. రేపో మాపో ఉప రాష్ట్రపతిగా జగదీప్ దన్ ఖడ్ ఎన్నికకానున్నారు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికయ్యారు. దీంతో గులాంనబీ అజాద్ కు కళ్లముందే ప్రధాని మోదీ మంచు తెరలు కరిగిపోయాయి. ఇన్నాళ్లూ నేలవిడిచి సాము చేసిన ఆజాద్ కు బీజేపీ పెద్దలు ఆడిన రాజకీయ డ్రామా తెలిసిపోయింది. దీంతో నేలపైకి వచ్చిన ఆయనకు తమ అధినేత్రి సోనియా గాంధీ కనిపించడం ప్రారంభించారు. గత రెండేళ్లుగా రాష్ట్రపతో, ఉప రాష్ట్రపతో అయిపోతానన్న కలలుగన్నారు. కాదుకాదు ఆయనలో ఆ భావనను సృష్టించారు. రెండింటిలో ఏదో ఒకటి దక్కుతుందన్న ఆయన వ్యూహం బెడిసికొట్టింది. అయితే రెండు సంవత్సరాల కిందట ఉన్న పరిస్థితిలో బీజేపీ లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలం పెంచుకుంది. ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం ఆనివార్యమయ్యేలా పరిస్థితులను సృష్టించుకుంది. అప్పట్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికకు అవసరమయ్యే సంఖ్యాబలం బీజేపీకి ఉండేది కాదు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీతో కొద్దిపాటి విభేదాలు కలిగిన గులాంనబీ ఆజాద్ బీజేపీ నేతలకు కనిపించారు. పైగా ఆయన్ను ఎగదోయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో చీలిక తేవడంతో పాటు జమ్ముకశ్మీర్ లో మైనార్టీల అభిమానం చూరగొనాలన్నది ప్రధాని మోదీ భావన. కానీ రాజకీయాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. బీజేపీ బలం పెరగడంతో ఆ పార్టీ వ్యూహం మార్చింది. ఆదివాసి గిరిజన మహిళను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన గిరిజనులను తమవైపు తిప్పుకోవాలని భావించింది. రాజస్థాన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగదీప్ దన్ ఖడ్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో ఆజాద్ ఆశలను నీరుగార్చింది.
అధినేత్రికి మద్దతుగా…
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఆజాద్ కు సొంత పార్టీ గుర్తుకొచ్చింది. ఇన్నాళ్లూ జీ23 పేరిట పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన ఆజాద్ కు తత్వం బోధపడింది. పార్టీ సంస్థాగతం గా ఎదగడానికి కృషిచేయకుండా మోదీ ట్రాప్ లో పడ్డానన్న విషయాన్ని ఇన్నాళ్లకు ఆయన గుర్తించారు. తనకు ఇంతలా గుర్తింపు తెచ్చిన సొంత పార్టీని నిర్లక్ష్యం చేశానన్న అపవాదును మూటగట్టుకున్నారు. అయితే తన తప్పు తెలుసుకున్నట్టు కేసుల్లో ఇరుక్కున్న అధినేత్రి సోనియా గాంధీకి మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు నిఘా సంస్థల తప్పిదాలను ఎత్తిచూపారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీపైనే తిరుగుబాటు చేసి… చేయాల్సిన నష్టం చేసి.. ఇప్పుడు అవకాశాలు లేక మళ్లీ సోనియా పంచన చేరారని కాంగ్రెస్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: Liger Waat Laga Denge song : లైగర్ రెచ్చిపోయింది: విజయ్ దేవరకొండ ‘వాట్ లగా దేంగే’..
[…] Also Read: Difference Between Modi And Sonia: మోదీ మార్క్ పాలిటిక్స్.. … […]