https://oktelugu.com/

Ayodhya BJP: అయోధ్య బీజేపీ ఆయువుపట్టు కాబోతోందా?

ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. పలు పార్టీలను చీల్చడం ద్వారా అధికారాన్ని అనుభవిస్తున్నది.

Written By:
  • Rocky
  • , Updated On : August 1, 2023 / 05:54 PM IST

    Ayodhya BJP

    Follow us on

    Ayodhya BJP: మరో ఏడాదిలో పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆరాటపడుతోంది. ఇందులో భాగంగానే తెర వెనుక ప్రయత్నాలు మొత్తం చేస్తోంది. ఏకంగా చిన్నాచితకా పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిని మళ్లీ లైన్లోకి తీసుకొచ్చింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పార్టీ నాయకులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అది కూడా ఇండియా కూటమి బెంగళూరులో సభ ఏర్పాటు చేసిన రోజే.. అయితే ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో, భారతీయ జనతా పార్టీలో ఆశలు రేకెత్తిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీయక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మోడీ చరిష్మా తగ్గిపోతుండడం భారతీయ జనతా పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి అయోధ్య రామాలయం తమను గట్టెక్కిస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

    ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. పలు పార్టీలను చీల్చడం ద్వారా అధికారాన్ని అనుభవిస్తున్నది. అంతేకాదు ఈ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు మొన్నటిదాకా తమ విమర్శించిన పార్టీ నాయకులతో పొత్తు పెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు వెనుకాడటం లేదు. తమతో చేతులు కలిపితే, ఇన్నాళ్లు తమ విమర్శించిన వారు కూడా సుద్దపూసలు అయిపోయినట్టేనని భారతీయ జనతా పార్టీ నాయకులు కొత్తగా సూత్రీకరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తమకు బంపర్ మెజారిటీ ఇచ్చిన రాష్ట్రాల్లో.. ఈసారి కూడా విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు యోచిస్తున్నారు. అయితే సర్వేలు మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలను ఇస్తున్నాయి. అందుకే క్షేత్రస్థాయిలో కష్టపడాలని అధిష్టానం నాయకులకు సూచిస్తున్నది. గత ఎన్నికల్లో మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గుంప గుత్తగా సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని విశేషకులు అంటున్నారు. 2014తో పోలిస్తే 2019లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గాయి. మరి 2019 లెక్కనే 2024 ఉంటే భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు తప్పవు.

    అయితే పై పరిణామాలు భారతీయ జనతా పార్టీ పెద్దలకు తెలుసు. అందుకే భారతీయ జనతా పార్టీ రామ మందిరాన్ని పాశుపతస్త్రంగా వాడుకుంటున్నది. త్వరలో ఈ రామ మందిరం ప్రారంభం కానుంది. ప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. తన వీలును బట్టి ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి రావచ్చని ఆహ్వాన కమిటీ తెలిపింది. మరి ఇదే ఆహ్వానం మిగతా వారికి అందుతుందా? అనేది తేలాల్సి ఉంది. కనీసం రాష్ట్రపతి నైనా ఆహ్వానిస్తారా అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతికి ఎలాంటి గౌరవం దక్కిందో మనం చూసాం. ఆ వేడుకలో కేవలం సాధువులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఇదే రామ మందిరాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బిజెపి పెద్దలు కార్యాచరణ రూపొందించినట్టు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో మతం అనే ప్రస్తావన తీసుకురాకుండా బీజేపీ ఉండదు. అంతటి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ కేరళ స్టోరీ ప్రస్తావన తీసుకొచ్చారు. కేవలం ఒక్క దక్షిణాది రాష్ట్రం విషయంలోనే మోడీ ఇలా చేస్తే.. 2024 ఎన్నికల్లో ఇంకెంత చేస్తారో అనేది చూడాల్సి ఉంది..