Aviva Baig: ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రైహన్ వాద్రా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అతడికి అవివా బేగ్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సోమవారం కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరికి వివాహం జరుగుతుందని ఇరు కుటుంబాలకు సంబంధించిన సన్నిహిత వర్గాలు వెల్లడించారు.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అవివాతో రైహన్ ఏడు సంవత్సరాలుగా సంబంధం లో ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 25 సంవత్సరాలు. రైహన్ ఇన్స్టాలేషన్, విజువల్ ఆర్టిస్ట్. ఇతడు డార్క్ పర్సెప్షన్ అనే సోలో ఎగ్జిబిషన్ ను ఇటీవల ప్రదర్శించాడు. ఢిల్లీ, డెహ్రాడూన్, లండన్ ప్రాంతంలో రైహన్ విద్యాభ్యాసం సాగింది. నేచర్ ఫోటోగ్రఫీని, ట్రావెలింగ్ ను ఇష్టపడతాడు. అతని కుటుంబం రాజకీయాలలో ఉన్నప్పటికీ.. అతడు సాధ్యమైనంతవరకు వాటికి దూరంగా ఉంటాడు.
అవివా బేగ్ నేపథ్యం ఇది
ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో ఉన్న సమాచారం ప్రకారం.. అవివా ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విద్యను అభ్యసించారు. ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్ నుంచి హ్యుమానిటీస్ లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు..
భారతదేశం వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలు, బ్రాండ్లు, క్లైంట్లకు ఉపకరించే ఫోటోగ్రఫీ స్టూడియోను నిర్వహిస్తున్నారు. తన స్టూడియోకు “అటేలియర్ 11” అని పేరు పెట్టారు.
రైహన్, అవివా గడిచిన ఏడు సంవత్సరాలుగా సంబంధం లో ఉన్నారు. ఇటీవల అవివా తన ఇన్ స్టా గ్రామ్ లో రైహన్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. తద్వారా అతనితో ఉన్న బంధాన్ని బహిర్గతం చేసింది.
గడిచిన ఐదు సంవత్సరాలుగా అనేక ప్రముఖ వేదికలపై అవివా తన ప్రదర్శనలను ప్రదర్శించింది. 2023లో ఢిల్లీలో నిర్వహించిన గ్యాలరీలో “యుకాంట్ మిస్ థిస్” , 2023లో “ఇండియా ఆర్టి ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రాం” , 2019లో “ది కరమ్ క్లబ్” నిర్వహించిన “ది ఇల్యూసరి వరల్డ్” , 2018లో “కే2 ఇండియా సంస్థ నిర్వహించిన ఇండియా డిజైన్” వంటి ప్రదర్శనలు చేసింది.
ఫోటోగ్రఫీ తో పాటు అవివాకు ఫుట్ బాల్ లో ప్రవేశం ఉంది. ఆమె ఆ క్రీడలో అద్భుతమైన ప్లేయర్. విభిన్నమైన ఆసక్తులు ప్రదర్శించడం ద్వారా రైహన్ మనసులో చోటు సంపాదించుకుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.