Y. S. Avinash Reddy- CBI: సాధారణంగా హై ప్రొఫైల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి ఉంటుంది. చిన్నపాటి కేసుల్లోనే అటువంటి పరిస్థితిని చూస్తుంటాం. కానీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ ఎదుర్కొంటున్న ఒత్తిడి.. ఏ ఇతర కేసుల్లో కనిపించలేదు. ఈ కేసులో ఆది నుంచి సీబీఐ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. చివరికి విచారణాధికారి కూడా మారారు. అయినా కేసు ముందుకెళ్తూనే ఉంది. కానీ సీబీఐకి మాత్రం ఆటంకాలు తప్పడం లేదు. తాము ఇంత బలహీనమా అనే అభిప్రాయానికి సీబీఐ రావాల్సి వచ్చింది.
గత ఎన్నికలకు ముందు.. పాదయాత్ర చేసిన సమయంలో విపక్ష నేత జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది..గుర్తుంది కదూ. అదేనండి కోడి కత్తి గీసుకుంది. చిన్నపాటి దెబ్బకు హైదరాబాద్ లోని ఆస్పత్రిలో జగన్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అప్పటికే విరామం ఎరుగని పాదయాత్ర ఒక వైపు, సీబీఐ వారం వారం విచారణ నుంచి తప్పించుకునేందుకు అదొక ఉపశమనంగా కనిపించింది. అయితే ఎంత రిలాక్స్ తీసుకోవాలో అంతగా తీసుకున్నారు.
ఇప్పుడు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గతంలో జగన్ కు లభించిన రిలాక్స్ నే కోరుకుంటున్నారు. అందుకే ఆరోగ్యంగాఉన్న తల్లికి సుస్తి చేసింది. మూడు, నాలుగు వారాల పాటు వైద్యం అవసరమైంది. అందుకు తాను కూడా ఆస్పత్రిలో తోడు ఉండాల్సి వస్తోంది. ఇక్కడే ఒక లాజిక్ మిస్సవుతున్నారు. అత్యవసర వైద్యం అందాలంటే హైదరాబాదో.. బెంగళూరో తీసుకెళ్లాలి కానీ కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో ఉంచడమే ఇప్పుడు పెద్ద ట్విస్ట్.
తాను విచారణకు హాజరైతే సీబీఐ ఏం చేస్తుందో తెలుసు. ఇప్పటికే కోర్టు కు చెప్పి కాచుకొని కూర్చొంది.అటు తన ముందస్తు బెయిల్ పై స్ట్రాంగ్ కారణం ఉంటే కానీ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం లేదు. అందుకే హాస్పిటల్ డ్రామా ఎపిసోడ్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. కానీ శక్తివంతమైన దర్యాప్తు సంస్థ ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లలో చిక్కుకోవడం విమర్శలకు తావిస్తోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకు చెప్పింది కానీ ఎప్పుడు చేస్తామన్నది చెప్పలేదు. ఇప్పటికే అరెస్ట్ కోసం ప్రయత్నాలు చేయలేదు. ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తోంది. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరవడం అనేది జరగదని తాజా పరిణామాలతో స్పష్టమయింది. ప్రజల ముందు సీబీఐ చులకన అవుతోంది.