Kapu Welfare: ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. అవశేష ఆంధ్రప్రదేశ్ లో అయినా జనాభాపరంగా కాపులదే అగ్రస్థానం. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా చూసుకుంటున్నాయే తప్ప వారి అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు లేవు. దశాబ్దాలుగా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నా కనికరించడం లేదు. ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ సర్కారు తమను నమ్మించి అన్నివిధాలా దగా చేసిందని కాపులు మండిపడుతున్నారు. కాపు సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసింది. పథకాల్లో భారీగా కోత విధించింది. ఒక్క కాపు నేస్తం తప్పించి మిగతా పథకాలన్నింటినీ రద్దు చేసింది. విద్యోన్నతి, విదేశీ విద్య పథకాలకు మంగళం పలికింది. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు కాపులపై ఎనలేని ప్రేమను కనబరిచారు. అధికారంలోకి వస్తే కాపుల బతుకులనే మార్చుతానని హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. తద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్లతో వారి ఆర్థిక స్థితిగతులను మార్చుతానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రూటు మార్చారు. అప్పటివరకూ చంద్రబాబు సర్కారు అందించిన పథకాలను సైతం రద్దుచేశారు. కాపు కార్పొరేషన్ అయితే ఏర్పాటుచేశారు కానీ.. వాటికి నిధులు, విధులు లేకుండా చేశారు.
నాటి పథకాలేవీ?
టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు ఏటా రూ.700 కోట్లు కేటాయించేది. దీంతో విద్యోన్నతి, విదేశీ విద్య, స్వయం ఉపాధి పథకాలు వంటివి కార్పొరేషన్ ద్వారా అమలుచేసేవారు. కాపు నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇవి ఎంతగానో ప్రయోజనకారిగా నిలిచేవి. ప్రధానంగా స్వయం ఉపాధి పథకాలకే ఏటా రూ.300 కోట్లు వరకూ ఖర్చుచేసేవారు. ఇవి ఎంతగానో సత్ఫలితాలనిచ్చినట్టు ఇప్పటికీ కాపు సామాజికవర్గీయులు చెబుతుంటారు. పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, కాపు సామాజికవర్గ భవనాలు వంటి వాటిని నిర్మించారు. కానీ జగన్ సర్కారు వచ్చాక వీటన్నింటికీ కోత విధించింది. కేవలం 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వారికి కాపునేస్తం మినహాయించి ఏ ఒక్క పథకం ఇప్పుడు నిలబడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక పద్ధతి ప్రకారం కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. తన రాజకీయ లబ్ధికి ఇబ్బడిముబ్బడిగా జగన్ వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. కార్యవర్గాలను నియమించారు. అయితే ఏ ఒక్క కార్పొరేషన్ కు విధులు, నిధులు లేవు. ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. వాటిలో కాపు కార్పొరేషన్ కూడా ఉండిపోయింది. ఏటా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన జగన్ రూపాయి విదిల్చడం లేదు. దీంతో కార్పొరేషన్ పాలకవర్గం ఈగలు తోలుకుంటుందన్న విమర్శ అయితే మూట గట్టుకుంది.
Also Read: Radhika Apte Viral Comments: పొడుగ్గా ఉంటే నచ్చదట.. భర్తపై రాధిక ఆప్టే కామెంట్స్ వైరల్
ఇచ్చింది గోరంత…
అయితే లెక్కల గారడీలో మాత్రం జగన్ సర్కారు ముందుంది. ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు సాయమందించి.. లక్షల్లో అందిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించుకుంటోంది. సాక్షి మీడియాలో పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతోంది. అటు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. నవరత్నాల రూపంలో అందించే అమ్మ ఒడి, రైతుభరోసా ఇలా అన్ని పథకాలను చేర్చి వేల కోట్ల రూపాయలు కాపులకు ఖర్చు పెడుతున్నట్టు జగన్ ప్రభుత్వం మభ్యపెడుతోంది. అటు రిజర్వేషన్లలో సైతం కాపులకు తీరని అన్యాయం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కింద చంద్రబాబు సర్కారు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్లను సైతం రద్దుచేసి కాపులపై ఉన్న తన అక్కసును జగన్ వెళ్లగక్కారు.
కార్పొరేషన్ నిర్వీర్యం..
కాపు కార్పొరేషన్ ను ప్రభుత్వం పరిగణిస్తున్న తీరు విస్మయం గొల్పుతోంది. రూ.2 వేల కోట్ల కేటాయింపుతో కాపు కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ల కంటే అగ్రగామిగా నిలుపుతామని వైసీపీ పాలక పెద్దలు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నారు. అయితే ఈ నియామకమే విస్తు గొల్పుతోంది. కేవలం పనిష్మంట్ అధికారులనే నియమిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా గతంలోగా పోటీ లేదు. ఏటా రూ.2 వేలు కేటాయిస్తామన్న ప్రకటనతో విపరీతమైన పోటీ నెలకొంది. తొలుత రాజానగరం ఎమ్మెల్యే రాజా పదవిని చేపట్టారు. ప్రస్తుతం విజయవాడకు చెందిన అడపా శేషు ఉన్నారు. అయితే కార్పొరేషన్ పదవి ఉత్సవవిగ్రహమే తప్పించి నిధులు, విధులు లేవని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ravi Teja Rama Rao On Duty: రవితేజకు షాక్, ఆ సీన్స్ లీక్.. టెన్షన్ లో రామారావు టీమ్ !