UP insurance scam: కష్టపడకూడదు. చెమట చుక్క చిందించకూడదు. ఒంటిపై వేసుకున్న చొక్కా నలగకూడదు. ఏదైనా సరే ఫ్రీగా రావాలి. అలా వచ్చిన దాంతో స్వర్గసుఖాలు అనుభవించాలి. జీవితంలో సౌఖ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్న నలుగురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు.
హర్యానా రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం ఉత్తరప్రదేశ్ లోని గ్రహ్ ముక్తేశ్వర్ గంగా ఘాట్ ప్రాంతానికి వచ్చారు. అంత్యక్రియలు జరపడానికి ఒక శవాన్ని తీసుకువచ్చారు. అక్కడి ఆచారాలను పాటించలేదు.. అంత్యక్రియలకు ముందుగా చేయవలసిన క్రతువులను పక్కన పెట్టారు. శవాన్ని నేరుగా చితి మీదికి తీసుకెళ్లారు. నేరుగా శవాన్ని దహనం చేయడానికి హడావిడి చేశారు. వారి తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో స్థానికులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఎందుకు ఇంత హడావిడిగా దాన సంస్కరాలు చేస్తున్నారని ప్రశ్నించారు.
స్థానికులకు అనుమానం వచ్చి శవం పై ఉన్న వస్త్రాన్ని తొలగించారు. శవం స్థానంలో ప్లాస్టిక్ బొమ్మ కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. జరుగుతున్నది మొత్తం నాటకమని గుర్తించారు. ఆ వ్యక్తులు వెంటనే పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఇతర వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తమకు ఢిల్లీ ఆస్పత్రి నిర్వాహకులు అసలు శవానికి బదులుగా వేరే శవాన్ని ఇచ్చారని కట్టుకథ చెప్పారు. దీంతో పోలీసులు తమ స్థాయిలో విచారించగా వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ నగరంలోని కైలాసపురి ప్రాంతాలకు చెందిన కమల్ సోమని అనే వ్యక్తి 50 లక్షల పైగా అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి తప్పించుకోవడానికి అతడు ఉత్తం నగర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ ఖురానా తో ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా కమల్ గతంలో తన వద్ద పనిచేసిన అన్షుల్ ఆధార్, పాన్ కార్డులను తీసుకున్నాడు.
ఏడాది క్రితం అతడి పేరు మీద 50 లక్షల జీవిత బీమా పాలసీని కొనుగోలు చేశాడు. క్రమ తప్పకుండా ప్రీమియంలు చెల్లించాడు. ఆ డబ్బు కోసం అతడు మరణించాడని నమ్మించే విధంగా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి శవాన్ని దహనం చేస్తున్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. నకిలీ అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ క్రమంలో పోలీసులు అన్షుల్ తో మాట్లాడారు.. తను ఆరోగ్యంగానే ఉన్నట్టు అతడు పేర్కొన్నాడు. తన మీద బీమా పాలసీ ఉన్న విషయంపై అతడు క్లారిటీ ఇవ్వలేదు. పోలీసులు కమల్, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.