Attack On Ministers At Visakha Airport: విశాఖ విమానాశ్రయంలో మొన్న జరిగిన ఎపిసోడ్ అంతా ప్లాన్ ప్రకారం జరిగిందా? గతంలో జరిగిన కోడి కత్తి తరహాలో చేయాలనుకున్నారా? వ్యూహాత్మకంగా పవన్ వచ్చే సమయానికి మంత్రులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారా? భారీ పోలీస్ బందోబస్తు మధ్య వస్తున్న మంత్రులు, వైసీపీ కీలక నాయకులపై దాడి సాధ్యమేనా? ..ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇవే చర్చనీయాంశమవుతున్నాయి. జనసేనను టార్గెట్ చేయడం వెనుక ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటి కోడి కత్తి డ్రామాను గుర్తుకు తెస్తున్నాయి. ఇవన్నీ ప్రీ ప్లాన్ గా చేసినట్టు ఉందని అటు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా జనసేనను బోనులో నిలిపేందుకేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతికూలతలు ఎదురైన ప్రతిసారి వైసీపీ అనుసరించే పంథా ఇదేనని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

నాడు విపక్ష నేతగా జగన్ సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసేవారు. సీబీఐ కేసులుండడంతో ప్రతీ శుక్రవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి విమానమార్గంలో హైదరాబాద్ వెళ్లేవారు. ఈ క్రమంలో విజయనగరంలో పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్లేందుకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు కోడి కత్తితో దాడిచేశాడు. అప్పట్లో వైసీపీ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. నేరుగా చంద్రబాబే కత్తి ఇచ్చి పంపించారన్న రేంజ్ లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో భారీగా రాజకీయ లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చాక కోడి కత్తి కేసు ఏమైందో? నిందితుడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. కేసులో విచారణ పూర్తిచేసి కుమారుడ్ని రిమాండ్ నుంచి తప్పించాలని నిందితుడి తల్లి ఎన్నిసార్లు ప్రభుత్వానికి లేఖరాసినా స్పందన లేదు. రావాల్సిన మైలేజీ వచ్చింది.. ఇక కేసుతో పని ఏమీ లేదనుకున్న వైసీపీ ప్రభుత్వానికి అదో అప్రాధాన్యత అంశంగా మారిపోవడంతో పట్టించుకోవడం మానేశారు.
అయితే ఇప్పుడు అదే ఎయిర్ పోర్టులో మరింత రక్తికంటించే సన్నివేశాలకు ఆజ్యం పోశారు. జనవాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. అప్పటికే వేలాది మంది జనసైనికులు అక్కడకు చేరుకున్నారు. అసలే రాష్ట్ర విభజన భావోద్వేగాల సమయమది. రెండు పార్టీలు వేర్వేరు స్టాండ్స్ తీసుకున్నాయి. ఆ సమయంలో ఎయిర్ పోర్టుకు వెళ్లడం తగునా? వెళ్ళినా పోలీసులు ఏమయ్యారు? బందోబస్తు ఎందుకు పెంచలేదు? రెండు పార్టీల శ్రేణులు ఎదురెదురుగా తారసపడితే కవ్వింపు సంకేతాలు రావన్న ధీమా ఎందుకు? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ వైపు అనుమానపు చూపులు చూడడం ప్రారంభించాయి. నాటి కోడి కత్తి డ్రామా ఎపిసోడ్ ను గుర్తుచేస్తున్నాయి. నాటి ఘటన సత్ఫలితమివ్వడంతోనే ఇప్పుడు జనసేనను కార్నర్ చేసుకొని ప్లాన్ బీ అమలు చేసినట్టు జనసైనికులు అనుమానిస్తున్నారు.

పవన్ విశాఖ పర్యటనకు రావొద్దని ముందస్తు హెచ్చిరికలతో ఇటువంటి వాటికి ప్లాన్ చేసి ఉంటారన్న అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అటు విశాఖ గర్జన కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. దాదాపు 50కుపైగా ఉన్న నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేశారు. కానీ పది వేల మంది మించి జనాలకు పోగుచేయలేకపోయారు. మరోవైపు జనసేన కార్యక్రమాలకు స్వచ్ఛందంగా జనాలు రావడం చూసి తట్టుకోలేకపోయారు. అందుకే కోడి కత్తి తరహాలో విశాఖ ఎయిర్ పోర్టు డ్రామాను తెరపైకి తెచ్చారు. మొత్తానికి కోడి కత్తి సీన్ ను యాజ్ టీజ్ గా దించేశారు. జన సైనికులను భయపెట్టాలని చూశారు. కానీ అవేవీ సక్సెస్ అయిన పరిస్థితుల్లో లేవు. తిరిగి ఇప్పుడు వైసీపీ మెడకే చుట్టుకుంటున్నాయి.