Telangana TDP: తెలంగాణ తెలుగు దేశం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్య నేతలతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. లిస్ట్ ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర కూడా చేయాలని చంద్రబాబునాయుడు సూచించినట్లు వెల్లడించారు.
నిలిచేదెవరు.. గెలిచేదెవరు..
పోటీ చేస్తామనడం వరకు బాగానే ఉంది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీటీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. 2004 తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాలేదు. మరోవైపు 2014 తర్వాత పార్టీ నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు క్రమంగా టీఆర్‌ఎస్‌లో చేరుతూ వచ్చారు. గతేడాది రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌రమణ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ లాంటి సీనియర్లు టీడీపీని వీడారు. రేవంత్‌రెడ్డ కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిస్థితిలో టీడీపీకి క్యాడర్‌ఉన్నా లీడర్లు లేరు. ఇలాంటి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో బరిలో నిలిచేందుకు అభ్యర్థులు దొరుకుతారా.. దొరికినా గెలుస్తారా అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ గెలిచి.. అక్కడ సత్తా చాటాలని..
వాస్తవానికి టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు సీఎంగా విజన్ 2020 పేరుతో అభివృద్ధి పనులు చేపట్టారు. హైటెక్‌సిటీ, రింగ్ రోడ్డు, ఫ్లై ఓవర్లు, ఎత్తయిన భవనాలు నిర్మించారు. నేడు తెలంగాణ అభివృద్ధికి, ఆర్థికంగా దూసుకుపోవడానికి నాటిన తన విజనేకారణమని చెబుతున్నారు. కానీ, నాడు తలసరి ఆదాయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవలేదు. ఆదాయం పెరగలేదు. పంటల దిగుబడి పెరుగలేదు. అయినా..తెలంగాణలో క్యాడర్ బలంగా ఉన్నందున అన్ని స్థానాల్లో పోటీకి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారు. దీని వెనుక చంద్రబాబు వ్యూహం కూడా వేరే ఉందంటున్నారు విశ్లేషకులు, ఇక్కడ కనీసం నాలుగైదు స్థానాలు గెలిచి ఆఫలితాలు చూసి ఆంధ్రాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్, ఖమ్మంపై దృష్టి..
హైదరాబాద్‌తో తాను చేసిన అభివృద్ధి ఇప్పటికీ చెక్కు చెదరలేదని, రంగారెడ్డి, మేడ్చెల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, తదితర ప్రాంతాల్లో ఆంధ్రా ప్రభావం, సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉంటాయని బాబు భావిస్తున్నారు. ఇక ఆంధ్రా సరిహద్దులో ఉన్న ఖమ్మంలో కూడా టీడీపీకి పట్టు ఉంది. ఇటీవల నిర్వహించిన సభకు భారీగా నాయకులు తరలి వచ్చారు. దీంతో ఖమ్మంలో కూడా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 అసెంబ్లీ స్థానాలైనా గెలవాలని బాబు భావిస్తున్నారు. ఈమేరకు అభ్యర్థులను ప్రకటించిన వెంటనే బస్సు యాత్ర కూడా చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు సూచించారు.
మరి బాబు ఆకాంక్ష ఏమేరకు నెరవేరుతుందో చూడాలి. ఒకవేళ ఈసారి టీడీపీకి సీట్లు రాకపోతే మాత్రం.. దాని ప్రభావం కూడా ఆంధ్రాలో కచ్చితంగా ఉంటుందని, అది అధికార వైసీపీకి ఆయుధం అవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.