అస్సాంలోని నగావ్ జిల్లాలోని థింగ్ లహ్కర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల మఫీజుద్దీన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. 2011లో వీరి పెళ్లి జరిగింది. ఇప్పటికి అతడి భార్య 25 సార్లు లేచిపోయింది. పారిపోయిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెబుతూ తిరిగి ఇంటికి వస్తుంది. వచ్చిన తరువాత ఇకపై అలా చేయనని భర్తతో మాయమాటలు చెప్పి మళ్లీ సంసారం చేస్తానని చెబుతుంది. దీంతో అతడు ఏం చేయలేక పిల్లల కోసం చేరదీయక తప్పడం లేదని వాపోతున్నాడు.
వైవాహిక జీవితంలో తృప్తి లేకనో మరే ఇతర కారణాల వల్లనో ఆమె తన వక్రబుద్దిని మార్చుకోలేకపోతోంది. దీనిపై భర్త కూడా ఆమెను ఏమి అనకపోవడంతో ఆమెకు అదో అలవాటుగా మారిపోయింది. వెళ్లిన ప్రతిసారి చుట్టాల ఇంటికి వెళ్తున్నానని చెప్పడమో లేక పనుందని చెప్పడమో చేస్తూ ఇంటి నుంచి వెళ్లిపోతోంది. మూడు నెలల పిల్లాడిని సైతం వదిలేసి వెళ్లడం గమనార్హం.
ఇటీవల రూ.22 వేల నగదు, ఇంట్లోని వస్తువులు తీసుకుని పారిపోయింది. ఇంత జరిగినా భర్తలో ఆమెపై ప్రేమ మాత్రం తగ్గడం లేదు. ఆమెను ఇంకా ప్రేమిస్తున్నానని చెప్పడం కొసమరుపు. ఒక వేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె భర్త సహనానికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్య చిన్న తప్పు చేస్తేనే చిత్రహింసలకు గురి చేసే భర్తలుండగా భార్య అన్ని తప్పులు చేసినా సంయమనం పాటించడం గొప్ప విషయమే.