YCP Politics : విజయనగరంలో వైసీపీకి షాక్.. పనిచేస్తున్న రాజుగారి మంత్రాంగం

Ashok Gajapathiraju vs YCP : తెలుగుదేశం పార్టీకి విజయనగరం కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి గెలుపొందాలని వ్యూహాలు రూపొందిస్తోంది. కానీ అది అంతగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే మునుపెన్నడూ లేనంతగా పూసపాటి రాజవంశీయులు యాక్టివ్ గా తిరుగుతుండడమే ఇందుకు కారణం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర మాజీ మంత్రి […]

Written By: NARESH, Updated On : December 18, 2022 2:07 pm
Follow us on

Ashok Gajapathiraju vs YCP : తెలుగుదేశం పార్టీకి విజయనగరం కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి గెలుపొందాలని వ్యూహాలు రూపొందిస్తోంది. కానీ అది అంతగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే మునుపెన్నడూ లేనంతగా పూసపాటి రాజవంశీయులు యాక్టివ్ గా తిరుగుతుండడమే ఇందుకు కారణం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసుకుంటూ ఎన్ని రకాలు ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెట్టారు. దీంతో రాజుపై జిల్లా ప్రజలకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ప్రజల కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులను వదులుకున్న రాజ వంశీయులపై ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో మార్పునకు కారణమైంది. అందుకే ఈసారి మొగ్గు టీడీపీ వైపు కనిపిస్తోందని అటు నిఘా వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది.

 

గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేశారు. విజయనగరం అసెంబ్లీ నుంచి తన కుమార్తె అతిది గజపతిరాజును బరిలోకి దించారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. అయితే కుమార్తె 5 వేల ఓట్లతో ఓటమి చవిచూడగా.. అదే నియోజకవర్గం నుంచి అశోక్ గజపతిరాజుకు మాత్రం ఎంపీగా 25 వేల ఓట్ల మెజార్టీ రావడం విశేషం. కేవలం అభ్యర్థి మార్పు వల్లే ఇక్కడ ఓటమి ఎదురైందని టీడీపీ అధిష్ఠానం గుర్తించింది. అందుకే ఈసారి ప్లాన్ మారుస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అశోక్ గజపతిరాజును పోటీచేయించాలని హైకమాండ్ నిర్ణయించినట్టు సమాచారం. అదే జరిగితే విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీచేస్తారు అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ కొత్తవారిని ఎంపీగా పోటీచేయించి అశోక్ ను అసెంబ్లీకి పోటీచేసి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న తలంపులో చంద్రబాబు ఉన్నారు.

ఆది నుంచి ఇక్కడ అశోక్ గజపతిరాజు అంటే జిల్లా ప్రజలు ఒకరకమైన అభిమానం చూపుతూ వస్తున్నారు. అవినీతి వంటి వాటికి దూరంగా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్. అటు రాజవంశీయులుగా మంచి పేరుంది. అయితే ముక్కుసూటిగా వెళ్లడం, ఇప్పటి రాజకీయాలకు అనుగుణంగా వెళ్లకపోవడం మైనస్ గా మారింది. కానీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న అశోక్.. ఇప్పుడు ప్రజల బాట పట్టారు. అటు ప్రజల్లో కూడా అశోక్ గజపతిరాజును దూరం చేసుకున్నామన్న బాధ వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు గెలుపు నల్లేరు మీద నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. చీపురుపల్లి నుంచి యువ నాయకుడు కిమిడి నాగార్జునను బరిలో నిలపనున్నారు. గత ఎన్నికల్లో ఆయన బొత్స సత్యనారాయణపై పోటీచేసి ఓడిపోయారు. అయినా గట్టిగానే పోరాడుతున్నారు. గతంకంటే చీపురుపల్లిలో టీడీపీ పుంజుకుందన్న సంకేతాలు వెలువడుతన్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ చార్జిగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు ఉన్నారు. వయోభారంతో బాధపడుతున్నా.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్లొంటున్నారు. ఆయన్ను తప్పించి కొత్తవారిని పోటీలో దించుతారని తెలుస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో బలమైన కేడర్ ఉంది. పోటీచేసేందుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. పతివాడ అనుమతితో అక్కడ కొత్తవారికి చాన్సిస్తారని ప్రచారం జరుగుతోంది.

బొబ్బిలి నియోజకవర్గం నుంచి రాజవంశీయులు మరోసారి రంగంలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ స్వల్ప ఆధిక్యతతోనే వైసీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆర్వీఎస్కే రంగారావుపై గెలుపొందారు. అంతకు ముందు ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన రంగారావు టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. కానీ గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ మంచి విజయాలు కనబరచింది. అటు నియోజకవర్గ ప్రజలు కూడా తిరిగి రాజకుటుంబం వైపు చూస్తున్నారు.

రాజాం నియోజకవర్గంలో కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు యోచిస్తున్నారు. ఇక్కడ మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. కానీ స్థానిక నాయకుడైన పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావుతో ఆయనకు పొసగడం లేదు.దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తెచ్చే చాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ప్రసాద్ తన అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు.

ఎస్.కోట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, గజపతినగరం నుంచి మాజీ ఎమ్మెల్యే కేఏ అప్పలనాయుడు నియోజవకర్గ ఇన్ చార్జిలుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికే టిక్కెట్లు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లా మొత్తం అశోక్ గజపతిరాజు ప్రాబల్యం ఎక్కువ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కోటను విడిచి రాజకీయాలు మొదలు పెట్టడం ప్రారంభించారు. అటు అధికార వైసీపీ గ్రూపు రాజకీయాలు, బొత్స కుటుంబంలో ఆధిపత్య చిచ్చు టీడీపీకి లాభించే అవకాశం ఉంది. అన్నింటికీ మించి అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ చేసిన రాజకీయం ఆ పార్టీకి మైనస్ గా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికైతే విజయనగరంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.