Goa Governor 2025: గోవా గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు( Ashok gajapathi Raju ) నియమితులైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు అశోక్ గజపతిరాజు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వచ్చారు. పార్టీలో ఎన్నో పదవులను అలంకరించారు. 2024 ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. రాజ్యసభ కానీ.. మరో నామినేటెడ్ పదవి కానీ ఇస్తారని భావించారు. కానీ అనూహ్యంగా ఆయనకు గవర్నర్ పదవి వరించింది. ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో గవర్నర్ ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చింది కేంద్రం. చంద్రబాబు అభిప్రాయాన్ని కోరగా.. పార్టీలో అందరి అభిప్రాయంతో అశోక్ గజపతిరాజు పేరును సూచించారు చంద్రబాబు. దీంతో ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: ఆపరేషన్ సింధూర్.. అస్సలు తగ్గే ప్రసక్తే లేదు!
జనతా పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ విజయనగరంలో( Vijayanagaram) పూసపాటి రాజవంశీయులది ప్రత్యేక స్థానం. అశోక్ గజపతి రాజు తండ్రి పివిజి రాజు, సోదరుడు ఆనంద గజపతిరాజు సైతం క్రియాశీలక రాజకీయాల్లో రాణించారు. వివిధ పదవులను చేపట్టారు. 1978లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అశోక్ గజపతిరాజు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1982లో ఎన్టీఆర్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు అశోక్. ఎన్టీఆర్ టిడిపి ప్రకటన చేసినప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒక విధంగా వ్యవస్థాపక సభ్యుడు కూడా. 1983 నుంచి 1999 వరకు టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అవుతూ వచ్చారు. ఎన్టీఆర్ తో ఎంతో సన్నిహితంగా గడిపేవారు. తరువాత చంద్రబాబుతో కూడా అదే సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. చంద్రబాబు సైతం అశోక్ కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. 2014లో కేంద్ర మంత్రివర్గంలోకి పంపించేందుకు ఎంపీగా పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన అశోక్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో రెండోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల కు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు అశోక్. అయితే అశోక్ సీనియారిటీకి, సిన్సియారిటీ కి తగ్గట్టు గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు.
Also Read: ధర్మస్థల హత్యల వివాదం.. పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదులో నిజముందా?
టిడిపికి రాజీనామా..
పూసపాటి రాజవంశానికి చెందినవారు అశోక్ గజపతిరాజు. ఆయన తండ్రి పూసపాటి విజయరామ గజపతిరాజు( pvg Raju) కూడా ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అశోక్ గజపతిరాజు సతీమణి సునీల గజపతిరాజు విజయనగరం మున్సిపల్ చైర్పర్సన్ గా పని చేశారు. ఒక్కగానొక్క కుమార్తె అదితి గజపతిరాజు సైతం మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. టిడిపి తో ఉన్న అనుబంధాన్ని కొద్ది రోజుల కిందటే ఎంచుకున్నారు అశోక్. టిడిపి సభ్యత్వంతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడిగా రాజీనామా చేశారు. గవర్నర్ గా రాజ్యాంగబద్ధ పదవి చేపట్టనుండడంతో రాజకీయాలనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తనకు టిడిపి ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. అటువంటి పార్టీకి ఎప్పుడు విధేయుడు గానే ఉంటానని అశోక్ ప్రకటించారు. ఈరోజు విజయనగరం కోట నుంచి.. రాజ్ భవన్ లోకి అడుగుపెట్టారు అశోక్. ఆయన అభిమానులు ఆనందంతో మురిసిపోతున్నారు.