Money Tips: సాధారణంగా డబ్బును పొదుపు చేయాలని.. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పే ఆర్థిక నిపుణులు చాలా మంది ఉంటారు. కానీ, ఎడెల్‌వైజ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించమని చెప్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కేవలం దాచుకోవడం మాత్రమే కాకుండా, ఆ ఫలాలను ఆస్వాదించడం కూడా ముఖ్యమే అని ఆమె అంటున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పొదుపు, ఖర్చు రెండూ అవసరమే
రాధికా గుప్తా తన సోషల్ మీడియా పోస్ట్ లో సిప్‌లను అమ్మడం తన ఉద్యోగమైనా, ప్రజలు తమ కష్టార్జితాన్ని ఆస్వాదించడానికి సమయం కేటాయించాలని తాను సూచించారు. “ఒక కలతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఇప్పుడు ఒక చిన్న సంతోషం నా మనసును నింపుతోంది. కష్టానికి లభించిన ఫలితం ఇచ్చే ఆనందం వేరు” అని ఆమె జూలై 23న Xలో పోస్ట్ చేశారు.
Also Read: మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఇంకా పడిపోతాయి.. వెంటనే కొనేయండి
ఆమె మాట్లాడుతూ.. “నా పని SIPలను అమ్మడం. కానీ నేను ఎప్పుడూ అందరికీ మీ కష్టాన్ని ఆస్వాదించడానికి సమయం కేటాయించమని చెప్తాను. డబ్బును పొదుపు చేయండి, కానీ మీకు ఆనందాన్ని ఇచ్చే వాటిపై కూడా ఖర్చు చేయండి. చివరికి, జీవితం ఎవరికి ఎక్కువ డబ్బు లేదా ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయనే పోటీ కాదు, ఎవరు ఎక్కువ ఆనందంగా బతికారన్నదే ముఖ్యం. పొదుపు, ఖర్చుల మధ్య ఒక మంచి మధ్యే మార్గం ఉంది, అది చాలా మంచిది” అని ఆమె స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో చాలా మంది పెట్టుబడిదారులతో మాట్లాడే రాధికా గుప్తా, వివిధ పెట్టుబడి అవకాశాలు, వాటిలో ఉండే రిస్క్‌ల గురించి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటారు. జూన్‌లో ఆమె పెట్టుబడిదారులను రిస్క్‌లను అర్థం చేసుకోకుండా అధిక రాబడుల కోసం ఆరాటపడవద్దని హెచ్చరించారు. కొంతమంది ఫిన్‌ఫ్లూయెన్సర్స్ అంటే ఆర్థిక విషయాలపై సలహాలు ఇచ్చే సోషల్ మీడియా వ్యక్తులు, ప్రజల్లో ఏదైనా మిస్ అవుతామనే భయాన్ని ఉపయోగించుకొని పెట్టుబడులను ప్రచారం చేస్తారని, అవి అనుభవం ఉన్న వారికి మాత్రమే సరిపోతాయని ఆమె చెప్పారు. మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లో కోట్ల మంది సాధారణ ప్రజలు నమ్మకంతో SIPల ద్వారా పెట్టుబడులు పెట్టడం వల్లనే భారత క్యాపిటల్ మార్కెట్‌లకు స్థిరత్వం వస్తుందని ఆమె అన్నారు.