ABN RK – Delhi liquor Scam : మిగతా విషయాలు ఎలా ఉన్నా ఒక రహస్యానికి సంబంధించి వివరాలు బయట పెట్టేటప్పుడు దానికి తగ్గ ఆధారాలు చూపించాలి. లేకుంటే దానిని బలపరిచే విషయాలను బహిర్గతం చేయాలి. అలా కాకుండా సస్పెన్స్ పేరుతో తలా తోకాలేని విషయాలను దానికి అనుసంధానం చేస్తే చదివే గారికి విసుగు కలుగుతుంది. అలాంటిదే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చేశాడు. ప్రతి ఆదివారం తన సొంత పత్రికలో రాసుకునే కొత్త పలుకు వ్యాసంలో ఈసారి ఏకంగా మోకాలికి బోడి గుండుకి లంకె కుదుర్చబోయాడు. కానీ ప్లాన్ మధ్యలోనే బెడిసి కొట్టడంతో పలుచన అయిపోయాడు.
మూడు వారాల కిందటే
అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ ఎటువైపు సాగుతుందో అర్థం కావడం లేదు. ఈ కేసులో నిందితులు అప్రూవర్లు గా మారారని ఈడీ చెబుతూ ఉంటుంది. నిందితులు మాత్రం తమను అకారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు బెదిరించారని అంటారు. మళ్లీ కొద్ది రోజులు గడిచేసరికి కొత్త ముఖాలు ఈ కేసులో కనిపిస్తాయి. ఫలితంగా రాసే పాత్రికేయులకు మాత్రమే కాదు చదివే పాఠకులకు కూడా ఒకింత ఆందోళన, ఆశ్చర్యం ఈ కేసు దర్యాప్తులో కనిపిస్తాయి. ప్రస్తుతం కూడా అలానే జరుగుతోంది. ఇంతకీ ఈ కేసులో నిందితులకు శిక్ష పడుతుందా? లేదా? అనేది పక్కన పెడితే రాసే పాత్రికేయులకు, ఓవర్గం మీడియాకు మాత్రం కావలసినంత మసాలా దొరుకుతున్నది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరబిందో శరత్ చంద్రారెడ్డిని అప్రూవల్ గా మార్పించాలని, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బిజెపి పెద్దలు చాలా కాలంగా కోరుతున్నారని కొద్ది రోజుల కిందట ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ సంస్థ ఎండి వేమూరి రాధాకృష్ణ రాసుకొచ్చారు. మూడు వారాల కిందట రాసినప్పటికీ తర్వాత అది నిజమైంది. ఈ విషయంలో రాధాకృష్ణకు ఉన్న పబ్లిక్ రిలేషన్ ను మెచ్చుకోక తప్పదు. ఇలా అప్రూవర్ గా అంగీకరింపజేయడంలో జగన్ సాధించింది ఏమిటి అంటే.. వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న దూకుడుకు అడ్డుకట్ట వేయాలని జగన్ కోరుకుంటున్నట్టు రాధాకృష్ణ చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు కవిత కూడా సేఫ్ అవుతుందని ఘంటాపథంగా కుండబద్దలు కొడుతున్నారు.
సేఫ్ ఎలా అవుతుంది
శరత్ అప్రూవర్ అయితే కవిత ఎలా సేఫ్ అవుతుందో రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో వివరించలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది వ్యవస్థీకృత నేరం. ఈ దేశంలో ఇంతవరకు జరిగిన వ్యవస్థీకృత నేరాలను ఏ దర్యాప్తు సంస్థ కూడా నిరూపించలేకపోయింది. ఎట్లాగూ రాజకీయంగా అవసరం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ కేసులో మొదట కవితను టార్గెట్ చేసింది. అసలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ మొదలు పెట్టక ముందే బిజెపి సోషల్ మీడియా కవితను లిక్కర్ క్వీన్ గా ప్రమోట్ చేసింది. కుంభకోణంలో ఆమె ఏం చేసిందో తనకున్న ఆధారాలతో బయటపెట్టింది. శరత్ చంద్రారెడ్డిని కూడా ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. ఈలోగా దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విచారించారు. ఇంత జరుగుతుంటే కవిత ఎలా సేఫ్ అవుతుందో ఆర్కే చెప్పలేకపోయారు. ఇప్పటికే కవిత గురించి అనేక ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇది జరుగుతుండగానే ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ వరుసలేఖలు రాస్తున్నాడు. పేరు, ఊరు లేని కంపెనీల గురించి వివరిస్తున్నాడు.. ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చూపిన వివరాలల్లో అరవింద్ మీద కంటే కవిత మీదనే ఎక్కువగా ఉన్నాయి. ఆర్కే చెప్పినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను మాత్రమే టార్గెట్ చేస్తే కేసు వీక్ అవుతుంది.. ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు ఒక బలమైన ఆయుధం లభించినట్టు అవుతుంది.
అందుకే ఇలా రాశారా
కవితను అరెస్టు చేయకపోతే ఈ కథనం నిజం అని ఆర్కే చెప్పుకొచ్చారు. బహుశా ఆయన టార్గెట్ కవితను కూడా వదిలిపెట్టకూడదని..అందుకే ఇలా రాశారని అభిప్రాయం కలుగుతోంది.. ఢిల్లీ లిక్కర్ స్టే మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థపై ఏబీఎన్ ఛానల్ లో మాట్లాడిన వారి మాటలపై న్యాయమూర్తి వ్యక్తం చేసిన ఆగ్రహంపై రాధాకృష్ణ స్పందించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన న్యాయ వ్యవస్థపై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో సూటిగా చెప్పేశారు. బెయిల్ విచారణలో కేసు మెరిట్స్ లోకి వెళ్లి వ్యాఖ్యలు చేయడం, అవినాష్ బెయిల్ పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వంటి వాటిని నేరుగానే ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ పనితీరును గట్టిగానే ప్రశ్నించారు.. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత సేఫ్ అంటూ పరోక్షంగా అరెస్టు చేయాల్సిందే అనే సంకేతాలు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారు.