Congress: కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు సీనియర్లకు మింగుడుపడటం లేదు. ఒక్కొక్కరుగా తమ నిరసన గళం విప్పుతున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకులు 23 మంది అధిష్టానంపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ పరిణామాలతో వారిలో ఆగ్రహం మరింత పెరిగింది. పార్టీకి అధ్యక్షుడు లేకనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా, సిద్దూను మళ్లీ నియామకం చేయడం అంశాలపై తమ ఉద్దేశాలు తెలియయజేస్తున్నారు. ఇలాగైతే పార్టీకి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పరోక్షంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల జోక్యంపై విమర్శలు చేస్తున్నారు. పార్టీకి అధ్యక్షుడిగా ఉండమంటే ఉండకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

అధిష్టానం చేసిన తప్పిదాలతో పార్టీకే నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మంచి నాయకులు పార్టీని వీడితే పార్టీ భవిష్యత్ లో అధికారంలోకి రావడం కష్టమవుతుందని సూచిస్తున్నారు. అమరీందర్ సింగ్ నుఉద్దేశించి వారు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయినా అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పలు ప్రాంతాలు నాయకత్వ లోపంతో మరింత దిగజారిపోయే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. అయినా దిద్దుబాటు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
పంజాబ్ పరిణామాలతో చత్తీస్ గడ్ లో ముసలం బయలుదేరింది. అక్కడ కూడా ముఖ్యమంత్రిని మార్చాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతుండడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమే అనే సందేహాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. పంజాబ్ విషయంలో వేసిన తప్పటడుగులు వేయకుండా సరైన నిర్ణయాలు తీసుకుని పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.
పార్టీకి చెందిన సీనియర్లు 23 మంది కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. పార్టీకి అధ్యక్షుడు లేకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని మరింత పాతాళంలోకి తోస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాగైతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే అని సూచనలు చేస్తున్నారు. పార్టీని సరైన దారిలో పెట్టగల నేత కావాలని చెబుతున్నారు. దీని కోసం అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.