ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి కిందటి ఎన్నికల్లో పొటీచేసి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితపై ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. సీఎం కూతురిపై గెలుపొందడం ద్వారా ఆయన పేరు గత ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మార్మోగింది.
Also Read: ఇంటిపోరుతో సతమతమవుతున్న మంత్రి?
మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుత టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)కు ఇద్దరు కుమారులు. వీరిలో సంజయ్ నిజామాబాద్ మేయర్ పదవీని గతంలో చేపట్టారు. ప్రస్తుతం తండ్రితోపాటు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఇక అరవింద్ కుమార్ 1976 ఆగస్టు 25న జన్మించారు. పోస్టు గ్రాడ్యుయేట్ చేశారు. అరవింద్ తండ్రి డీఎస్ టీఆర్ఎస్ లో కొనసాగుతుండగా ఆయన మాత్రం తన తాతను ఆదర్శంగా తీసుకొని బీజేపీలో చేరారు. అరవింద్ తాత గతంలో జనసంఘంలో ఉన్నారని ఆయన భావజాలమే తనలో ఉందని చెబుతుంటాడు. ప్రధాని నరేంద్రమోదీ యువత కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడై ఆయన బీజేపీలో చేరాడు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా అరవింద్ కుమార్ పోటీ చేసి కేసీఆర్ కూతురు కవితపై గెలుపొందాడు.
ఇక టీఆర్ఎస్ నుంచి డీఎస్ రాజ్యసభకు వెళ్లగా.. బీజేపీ నుంచి అరవింద్ ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఒకరు రాజ్యసభకు.. మరొకరు లోక్ సభకు వెళ్లడం గమనార్హం. ఇక చదువుకునే రోజుల్లోనే మంచి క్రికెట్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కుడిచేతి బ్యాట్సమెన్ అయిన అరవింద్ 1995-96 సంవత్సరంలో హైదరాబాద్ ఫస్టు క్రికెట్ మ్యాచుల్లో ఆడారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే అరవింద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎంపీగా గెలిచాక ప్రజా సేవ చేస్తూనే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అక్కడి రైతులకు హామీ ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డు తెచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు.
Also Read: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఇక అతనే సీఎం..?
అధికార టీఆర్ఎస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేస్తూ ముందుకెళుతున్నారు. ఆయన రాజకీయాల్లో తొలి నుంచి దూకుడు పంథాలోనే వెళుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఆయన మరింత దూకుడుగా వెళుతున్నారు. అరవింద్ మాటల దాడిని ఎదుర్కొలేక ఇటీవల టీఆర్ఎస్ నేతలు వరంగల్ జిల్లాలో ఆయనపై దాడి చేశారు. దీంతో బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ ఇష్యూ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అరవింద్ మాత్రం ‘నేను దేశ భక్తుడిని.. నా దేశం.. ప్రధాని కోసం నా జీవితాన్ని అర్పిస్తా’నని చెబుతుంటారు.