ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ తీవ్రమైన పదజాలం ఉపయోగించారు. జమ్మికుంటలో పర్యటిస్తున్న ఆయన టీఆర్ఎస్ పై ఘాటుగా విమర్శలు చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే ఇక్కడ కేటీఆర్ ను పోటీకి దింపాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు తుంగలో తొక్కి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ కు గడ్డు రోజులు మందున్నాయని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. కేటీఆర్ జన్మలో సీఎం కారని చెప్పారు.
కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్ ను హుజురాబాద్ ఉప ఎన్నికలో నిలబెట్టాలని అన్నారు. ఎన్నికల్లో రూ.300 కోట్లు ఖర్చు పెట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ వద్ద డబ్బులు తీసుకున్న వారు ఈటల రాజేందర్ తో టచ్ లో ఉన్నారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ దళితులకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి తరువాత మాట మార్చారని దుయ్యబట్టారు. దేశంలో పని చేయని సీఎం ఒక్క కేసీఆరే అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ నిర్ణయాలతో పరిశ్రమలు అమ్ముడుపోయే స్థాయికి చేరుకున్నాయన్నారు. తెలంగాణ భూములను అమ్మకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు రాజకీయాల్లో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఇంకా సిగ్గు లేకుండా ఇతర పార్టీలపై ఏడుస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పడం ఖాయంగా అనిపిస్తోందని గుర్తు చేశారు.