
ఆలూ లేదు చూలు ఈటల కొత్త పార్టీ అంట అని కొందరంటారు. కానీ పార్టీ పెట్టను.. బీజేపీ, కాంగ్రెస్ లో కలవను అంటారు ఈటల రాజేందర్. మరి ఏం చేస్తున్నారంటే.. కేసీఆర్ వ్యతిరేకులను కలుస్తున్నారు. తనలాగే కేసీఆర్ చేతిలో భంగపడ్డ వారి విలువైన సలహాలు, సూచనలు ఈటల తీసుకుంటున్నారు. ‘కేసీఆర్ ఖతర్నాక్’ అని గుడ్డిగా ముందుకెళ్లొద్దని తాజాగా సీనియర్ నేత డీఎస్ సలహాలిచ్చాడట.. ఏం చేయాలో తెలియక ఈటల ఇప్పుడు అందరి అభిప్రాయలు తీసుకునే పనిలో పడ్డారట..
తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ను ఢీకొట్టే మగాడే ఇంకా పుట్టలేడన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ను సైతం సాగనంపిన కేసీఆర్ ను అనే దమ్ము ధైర్యం మీడియాకు, ప్రతిపక్షాలకు లేకుండా పోయాయని అంటున్నారు. అయితే ఆది నుంచి పార్టీలతో తనతోపాటు బలంగా నిలబడే వారిని సాగనంపడం కేసీఆర్ కు అలవాటే నంటున్నారు. ఆలె నరేంద్ర నుంచి విజయశాంతి, ఈటల వరకు కేసీఆర్ ను నమ్మి మోసపోయిన వారేనంటున్నారు.
అయితే కేసీఆర్ ను ఊరికే వదిలేలా కనిపించడం లేదు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ‘తెలంగాణ కేసీఆర్ జాగీరూ కాదని.. తెలంగాణకు మేమే బాస్ ’ లమని ఆయన ముందునుంచి నినదిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నుంచి తెలంగాణను విముక్తి చేసే ప్రయత్నాలకు ఈటల శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలోని కేసీఆర్ బాధితులను కలిసే పనిలో పడ్డారు ఈటల రాజేందర్. కేసీఆర్ బాధితులందరినీ ఒక్కచోట చేర్చి గులాబీ దళపతిపై పోరాడాలని స్కెచ్ గీస్తున్నారు.
తెలంగాణలోని అన్ని పార్టీల్లోని సీనియర్, కీలక నేతలను కలిసి ఈటల రాజేందర్ సమాలోచనలు జరుపుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడ్డ డీఎస్ ను కలిసి ఈటల చర్చ జరిపారు. డీఎస్ ది కూడా ఈటల కథే. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని కేసీఆర్, టీఆర్ఎస్ దూరం పెట్టింది. డీఎస్, ఈటల కూడా బీసీ నాయకులు కావడమే ఇక్కడ విశేషం.
ఇక కేసీఆర్ పై పోరాటానికి ఈటలను వాడుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ లు ప్లాన్ చేస్తున్నాయి. టీఆర్ఎస్ గుట్టు మట్లు తెలిసిన ఈటలతో కేసీఆర్ ను దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. మరి వారి బుట్టలో ఈటల బరెస్ట్ అవుతాడా? లేక పెద్దలు చెప్పిన మాట విని సర్దుకుపోతాడా? అన్నది ముందు ముందు చూడాలి.