TDP: ఎన్నికల్లో పార్టీకి కోట్లు ఖర్చు పెట్టారు. ఓడిపోయాక అండగా నిలబడ్డారు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. అధికార పక్షంతో పోరాడుతూనే.. సొంత పక్షంలోని అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడేమో టికెట్ ఖాయం కాదని చెబుతున్నారు. దిక్కుతోచక మౌనంగా ఉండిపోతున్నారు. ఇది ఏపీలోని టీడీపీ ఇంచార్జీల పరిస్థితి.

ఏపీ టీడీపీ 2019 ఎన్నికల్లో ఓడిపోయాక.. ఓడిపోయిన అభ్యర్థుల్నే ఇంచార్జీలుగా నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గ ఇంచార్జీలే పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. అధికార పార్టీ తప్పొప్పుల్ని ఎత్తిచూపుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం చెప్పిన మాట ఇంచార్జీల నోట్లో వెలగపండు పడ్డట్టు అయింది. టీడీపీ ఇంచార్జీలకు టికెట్ ఖాయం కాదనే మాటతో ఇంచార్జీలు మిన్నుకుండిపోయారు. అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారట. దీంతో చివరి వరకు టికెట్ ఎవరికీ ఫైనల్ కాదని చెబుతున్నారట.
ఇన్నేళ్లు కోట్లు రూపాయలు ఖర్చు చేశాం. ఇప్పుడు టికెట్ లేదంటే ఎలా అని టీడీపీ ఇంచార్జీలు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారట. అధినేత మాత్రం మొహమాటానికి పోకుండా.. గ్రౌండ్ లెవెల్ సర్వేల్లో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారట. గతంలో దొర్లిన తప్పుల్ని మళ్లీ జరగకూడదని నిశ్చయించారట. నియోజకవర్గాల్లో పార్టీకి పెద్ద దిక్కు ఉండాలనే ఇంచార్జీలను నియమించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అధికార పక్షం పై ఆయా నియోజకవర్గాల్లో పోరాడుతున్న టీడీపీ ఇంచార్జీలకు సొంత పార్టీలోనే అసమ్మతి తప్పడం లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ రెండు మూడు గ్రూపులుగా విడిపోయారు. ఎవరికి వారు సొంత ప్రయత్నాలు చేస్తూ టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. పార్టీ కేడర్ కూడ ఏ గ్రూపు వైపు వెళ్లాలో.. ఎవరికి టికెట్ వస్తుందో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో కొన్ని సీట్లు జనసేనకు వెళ్తాయి. ఇది కూడ ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ఇంచార్జీలకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందట. మరి టీడీపీ ఎలాంటి సర్దుబాట్లతో వెళ్తుందో వేచిచూడాలి.