Ramoji Margadarsi: ఉదయం లేస్తే ఈనాడు పత్రిక ద్వారా విలువలు, మార్గదర్శి ద్వారా నీతి వాక్యాలు, రామోజీ ఫిలిం సిటీ ద్వారా విశ్వసనీయత, డాల్ఫిన్ హోటల్స్ ద్వారా చట్టబద్ధత గురించి వల్లె వేసే రామోజీరావు.. ఆయన మాత్రం వాటిని పాటించడు. అవి వున్నది కేవలం సామాన్యులకు మాత్రమే అని.. తాను మాత్రం అందుకు అతీతం అని చెప్పుకుంటాడు. ఫిలిం సిటీ కోసం ఒక ఊరు మొత్తం తనకోసం కేటాయించుకున్నా, హైదరాబాద్ మహానగరంలో 2000 ఎకరాలను తన చేతిలో ఉంచుకున్నా.. రామోజీరావుకి మాత్రమే చెల్లింది. అంతేకాదు ఆయన తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థల్లో నిబంధనలు పాటించరు. ప్రభుత్వ నియమాలను గాలికి వదిలేస్తారు. మొత్తానికి తాను ఒక స్వయంప్రతిపత్తి గల వ్యక్తిని అని భావించుకుంటారు. తాజాగా ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి సంస్థలు చేస్తున్న సోదాల్లో బయటపడుతోంది అదే.
మార్గదర్శి పేరిట ఏపీలోని 37 శాఖల్లో సంస్థ పేరిట ఉన్న టికెట్ల చందాను చెల్లించడం లేదు. దీనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు బ్యాంకు రికార్డుల్లో నమోదు కావడం లేదు. కానీ మేనేజ్మెంట్ టికెట్లకు చెల్లించాల్సిన డివిడెంట్లు, టికెట్ల పేరిట చిట్టి పాట పాడి ప్రైజ్ మనీ మాత్రం తీసుకుంటున్నది. రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు గురువారం నుంచి మార్గదర్శి సంస్థలు జరుపుతున్న సోదరులకు అక్కడి సిబ్బంది సహకరించడం లేదని ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఈ ఐడి అధికారులు అంటున్నారు. తమ బృందాలు లోపలికి వెళ్లకుండా అక్కడి సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని వారు అంటున్నారు. ఇదే కాదు సోదాల సందర్భంగా కీలక రికార్డులు చూపించేందుకు సిబ్బంది నిరాకరించారని అధికారుల బృందం చెబుతోంది. అయితే అధికారుల బృందానికి సహకరించకూడదని మార్గదర్శి ప్రధాన కార్యాలయం నుంచి శాఖలకు ఫ్యాక్స్ ద్వారా ఆదేశాలు రావడం కలకలం రేపుతోంది. ఏపీ అధికారులు రావడంతో ఈనాడు పాత్రికేయులు కూడా మార్గదర్శి కార్యాలయాల వద్ద భారీగా మోహరించడం విశేషం.
ఇక గురువారం నుంచి మొదలైన సోదాలు శనివారం వరకు కూడా సాగుతాయని ఏపీ అధికారులు అంటున్నారు. అయితే ఈ సోదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి సిబ్బంది ప్రధాన కార్యాలయానికి చేరవేశారు. అయితే తాము చేస్తున్న సోదరులకు సంబంధించి సమాచారాన్ని వక్రీకరించి సొంత మీడియాలో వార్తలు ప్రసారం చేశారని ఏపీ అధికారులు అంటున్నారు. తాము నిష్పక్షపాతంగా సోదాలు చేస్తుంటే బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారంటూ అధికారులు చెబుతున్నారు. ఈ విధంగానైనా సోదాలు అడ్డుకునేందుకు మార్గదర్శి యాజమాన్యం పన్నాగం పన్నిందని ఏపీ అధికారులు వివరిస్తున్నారు.
సంవత్సరాలుగా మార్గదర్శి యాజమాన్యం ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నదని ఏపీ అధికారులు అంటున్నారు. తమ సోదాల్లో దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు లభించాయని ఏపీ అధికారులు చెబుతున్నారు. సంస్థ కేవలం చిట్ ఫండ్ చట్టం, ఆర్బీఐ నిబంధనలు మాత్రమే కాదు.. ఐపీసీ చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడిందని ఏపీ సిఐడి అధికారులు అంటున్నారు. ప్రధానంగా చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడిన తీరు తాము గుర్తించామని ఏపీ సిఐడి అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి చిట్టి గ్రూపుల పాటలు నిర్వహిస్తే కనీసం ఇద్దరు సభ్యుల కోరం ఉండాలి. కానీ ఆ కోరం లేకుండానే చిట్టి పాటలు నిర్వహిస్తోంది. అందుకోసం చందాదారులు వచ్చినట్టుగా వారి సంతకాలు మినిట్స్ బుక్ లో ఫోర్జరీ చేస్తోందని ఏపీ సిఐడి అధికారులు అంటున్నారు. అంతేకాదు కొందరు చందాదారులు రాలేనందున, వారి తరఫున చిట్టి పాటలు పాల్గొనేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏజెంట్లకు అనుమతి ఇచ్చినట్టు పత్రాలు కనిపించినట్టు తెలుస్తోంది. ఆ సంతకాలు ఉన్న చందాదారులను అధికారులు సంప్రదించడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. తాము రాకుండా వచ్చినట్టు మినిట్స్ బుక్ లో ఎందుకు సంతకాలు చేశారని చందాదారులు ప్రశ్నిస్తే నీళ్ళు నమలడం మార్గదర్శి యాజమాన్యం వంతయింది. చందాదారుల సంతకాలను, మార్గదర్శి రికార్డుల్లో ఉన్న సంతకాలను పోల్చి చూస్తే 70 శాతం ఫోర్జరీవే అని అధికారుల తనిఖీల్లో తేటతెల్లమైంది. దశాబ్దాలుగా మార్గదర్శి యాజమాన్యం ఇలా చేస్తోందని ఏపీ అధికారులు అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిర్వహించిన సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. అంతేకాదు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని చందాదారుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తదుపరి చర్యలకు ఏపీ సిఐడి అధికారులు అడుగులు వేస్తున్నారు.