CM Jagan: ఏపీలో గిరిజనులు సీఎం జగన్ కు షాక్ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలుగా రహదారులు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఫలితం లేకపోవడంతో.. విసిగి వేశారిపోయారు. తామే సొంతంగా రహదారులు నిర్మించుకున్నారు. కూలీ నాలీ చేసుకొని రూ. 29 లక్షలు పోగు చేసుకున్నారు. 11 రహదారులను నిర్మించి తమ రాకపోకలకు మార్గం సుగమం చేసుకున్నారు. గిరిజన సంక్షేమం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా.. 29 లక్షలు మంజూరు చేయలేని స్థితిలో వైసీపీ సర్కార్ ఉండడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సాధారణంగా గిరిజనులు అల్పసంతోషులు అంటారు. వారు ఏమీ భారీగా అడగరు. ఇవ్వలేదని ఏనాడు ఆందోళన చేయరు. అయితే తాము పండించిన పంటలు, అటవీ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు వెళ్లడానికి దారి కావాలని కోరుకున్నారు. కనీసం నడిచి వెళ్లేందుకు వీలుగా మట్టి రహదారిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యేలను కలిశారు. అయినా వారి పని కాలేదు. దీంతో వారే తలో మొత్తం వేసుకొని.. తమ దారి తాము చూసుకున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకుకు వైసీపీకి చెందిన చెట్టి పాల్గుణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జోలాపూర్ పంచాయతీ తోటిగొడి పుట్ కు కనీస రహదారి సౌకర్యం లేదు. దీంతో చాలామంది అత్యవసర అనారోగ్య సమయాల్లో ఇబ్బంది పడ్డారు. వారిని డోలీల్లో తీసుకెళ్లే పరిస్థితి దాపురించింది. ఈ తరుణంలో గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త దొర జమ్మె చొరవ చూపుతూ నిధులు సమీకరించింది. తాను సింహభాగం భరిస్తూ.
.. గ్రామస్తుల నుంచి విరాళాలు పోగు చేసింది. రూ.2.5 లక్షలతో మూడు కిలోమీటర్ల మేర మట్టి రహదారిని ఏర్పాటు చేసింది. కానీ ఆమె సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అయితే ఒక్క అరకులోనే కాదు.. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో సైతం గిరిజనులు సొంతంగా నిధులు పోగుచేసుకుని రహదారులు నిర్మించుకున్నారు. పాడేరు, పాలకొండ, కురుపాం.. ఇలా అన్ని నియోజకవర్గాలను కలుపుకొని దాదాపు 11 రహదారులను గిరిజనులు సొంతంగా నిర్మించుకోవడం విశేషం. గిరిజనుల ప్రాథమిక మౌలిక వసతి అయిన రహదారిని కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో వైసీపీ సర్కార్ ఉండడం విచారకరం. బటన్ నొక్కి వందల కోట్లు విడుదల చేస్తున్న జగన్ మా విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉండడం తగదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.