AP Cabinet: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో తనదైన శైలి చూపించారు. కేబినెట్ కూర్పులో సమర్థులకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. పాత మంత్రుల్లో కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలియడంతోనే వారిని పక్కన పెట్టినట్లు సమాచారం. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఆరుసార్లు పోటీ చేసి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేనికి ఈసారి విస్తరణలో చుక్కెదురైంది. దీంతో ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. పాతవారిని 11 మందిని మంత్రులుగా నియమించినా అందులో బాలినేని పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
మంత్రివర్గంలో చోటు దక్కని మరో ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు. గిద్దలూరు నుంచి గెలిచిని ఆయనకు మొదటి విడతలోనే మంత్రి పదవి ఖాయమనుకున్నా చివరి క్షణంలో ఆయనకు మంత్రి పదవి దక్కకుండా పోయింది. దీంతో ఈసారి కచ్చితంగా పదవి వస్తుందనుకున్నా నిరాశే మిగిలింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన తదుపరి కార్యాచరణపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇలా చాలా మందిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడిన గిద్దలూరు, దర్శి, కనిగిరి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్ర మధుసూదన్ యాదవ్, సుధాకర్ బాబు పదవులపై ఎన్నో ఆశలు పెంచుకున్నా చివరకు పదవి దక్కకపోవడంతో ఆగ్రహం పెంచుకున్నారు. దీంతో అసంతృప్తులను ఊరడించాలని అనుకున్నా కుదరడం లేదు. కొందరైతే పార్టీ వీడాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: కొడాలి నాని పోయే.. రోజా వచ్చే.. టార్గెట్ చంద్రబాబు
మంత్రిపదవుల విషయంలో రాత్రి వరకు హైడ్రామా నడిచింది. మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారనే విషయం తెలియక అందరు తికమక పడ్డారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అదే ఉత్కంఠ. దీంతో అందరు తమకు పదవి వస్తుందా? లేదా? అనే సంశయంలోనే ఉన్నారు. చివరకు పదవులు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. అసంతృప్తులు ఇక వేరే దారి చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసినా చివరకు మమ్మల్ని పక్కన పెట్టడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?