
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గత నెలన్నర కాలంగా పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం మే 4వ తేదీ నుంచి 3వ విడుదల లాక్ డౌన్ గ్రీన్, ఆరంజ్ జోన్ లలో కొన్ని మినహాయింపులతో అమలు చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఆర్థిక వనరులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సోమవారం మద్యం అమ్మకాలు ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలు నేటి నుంచి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. ఆ శాఖ కమిషనర్ రంజిత్ భార్గవ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
దీంతో మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగులు విధులకు హాజరు కానున్నారు. భౌతిక దూరం పాటిస్తూ కార్యాలయాల్లో విధుల్లో పాల్గొనాలని సూచనలు ఉండటంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. అలాగే రిజిస్ట్రేషన్‌కి వచ్చే వారికి సీరియల్ ప్రకారం భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ పనిచేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ శాఖ కార్యక్రమాలు ప్రారంభించినా రిజిస్ట్రేషన్లపై కరోనా, లాక్ డౌన్ ల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. భూములు, స్థలాల క్రయవిక్రయాలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి గతంలో జరిగిన అగ్రిమెంట్ దశలో ఉన్న క్రయ విక్రయాలు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తనఖా రిజిస్ట్రేషన్ చేయించి రుణాలు పొందటం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక శుభవార్తగానే చెప్పొచ్చు. రెడ్ జోన్ లో ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రం తెరుచుకోవని సంబంధిత అధికారులు చెబుతున్నారు.