
చరిత్ర అనేది ఎన్నటికీ ఒడువడని ముచ్చట. అది కాల గర్భంలో కలిసిపోయిన విషయాలను తవ్వితీసే గునపం! నేటి సమాజానికి అందని గత విజ్ఞానాన్ని, సముపార్జించి పెట్టే యూనివర్సిటీ! మట్టి దిబ్బల్లో.. కొండ గుహల్లో.. మగ్గిపోతున్న నిజాలను ప్రపంచానికి చాటిచెప్పే అద్వితీయ సాధనం. అందుకే.. వర్తమానం, భవిష్యత్ కన్నా.. చరిత్రకే బరువెక్కువ. విలువెక్కువ! అలాంటి చరిత్ర.. తాజాగా తెలంగాణలో సరికొత్త విషయాన్ని వెలికితీసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతానికి సంబంధించిన గత జ్ఞాపకాలను తెరచి చూపింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
మానవ జీవితానికి 10 లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాలంలో మనిషి ఎక్కడెక్కడ సమూహంగా బతికాడు? అక్కడ ఎలాంటి జీవనాన్ని గడిపాడు? అన్నది ఇప్పటికీ పూర్తిగా తెలియదు. భవిష్యత్ లో కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి.. నాగరికత వెలుగు చూస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ కోణంలోనే హుజూరాబాద్ లో సరికొత్త చరిత్ర వెలుగు చూసింది. ఈ పట్టణానికి ఏకండా 2 వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంచనా వేస్తున్నారు చరిత్రకారులు. ఔత్సాహిక పురావస్తు చారిత్రక పరిశోధకుడు ఆర్. రత్నాకర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. హుజూరాబాద్ గత చరిత్రను చాటిచెప్పారు.
హుజూరాబాద్ సమీపంలోని రంగనాయకుల గుట్ట దిగువన ఏదులాపురం అనే గ్రామం ఉండేదని కనుగొన్నట్లు రత్నాకర్ రెడ్డి తెలిపారు. అత్యంత పురాతనమైన నాగరికత ఇక్కడ విలసిల్లిందని ఆయన చెబుతున్నారు. ఇక్కడ లభించిన ఆనవాళ్లు.. నాటి ప్రజల జీవన విధానానికి, ప్రతిభకు అద్దం పడుతున్నాయని తెలిపారు. ఇక్కడ ఉన్న రోళ్లు మనం ఉపయోగించే వాటికన్నాచాలా పెద్దగా ఉన్నాయి. అంతేకాదు.. అలంకరణకు ఉపయోగించే మట్టి పూసలు, వీరుల విగ్రహాలు, నాగ దేవతల బొమ్మలు, భైరవ శిల్పం వంటి ఎన్నో ఆధారాలు లభించాయి.

ఇక, ఇక్కడ 2 వేల ఏళ్ల క్రితమే ఇనుము, ఉక్కును ఉపయోగించారని, అందుకు సంబంధించిన పరిశ్రమలు కూడా కొనసాగాయని ఆనవాళ్లు తెలియజేస్తున్నాయి. కుండల పరిశ్రమ, ఇంటి నిర్మాణానికి వినియోగించిన పెద్ద పెద్ద ఇటుకలు ఇక్కడ లభించాయి. నవీన శిలాయుగం నుంచి శాతావాహనుల కాలం వరకు ఈ నాగరికత కొనసాగినట్టు చెబుతున్నారు.
ఏదులాపురం గ్రామం రంగనాయకుల గుట్ట చుట్టూ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ గ్రామాన్నే ఇప్పుడు హుజూరాబాద్ అని పిలుస్తున్నట్టు రత్నాకర్ తెలిపారు. ఇక్కడ ఉన్న రోళ్లను పెద్ద పెద్ద బండల మీదనే చెక్కారు. అవి కూడా సాధారణం ఎక్కు వెడల్పుగా ఉండడం.. లోతు తక్కువగా ఉండడం గమనించాల్సిన అంశం. ఈ ఆధారాలను బట్టి ఈ రోళ్లను ఆయుర్వేద మందుల తయారీ కోసం వినియోగించి ఉండొచ్చని చెబుతున్నారు. ఇలాంటి రోళ్లనే.. గతంలో హన్మకొండలోని అగ్గలయ్య గుట్టపైనా గుర్తించినట్టు రత్నాకర్ తెలిపారు.
ఇక, రంగనాయకుల గుట్ట సమీపంలో చిట్టెపు రాళ్లు చాలా ఉన్నాయని తెలిపారు. ఇనుమును సంగ్రహించి పోత పోసేటప్పుడు మిగిలిన వ్యర్థ పదార్థాలనే చిట్టెపు రాళ్లు అని అంటారట. ఈ ఆధారాల ద్వారా 2 వేల ఏ్ల క్రితమే ఇనుము, ఉక్కు పరిశ్రమ ఉందని అర్థమవుతోందని చెప్పారు రత్నాకర్. ఇక్కడ లభించిన రంగు రాళ్లు, వివిధ రంగుల్లోని మట్టిపూసలను గమనిస్తే.. ఇక్కడి ప్రజలు అలంకార ప్రియులనే విషయం కూడా అర్థమవుతోందన్నారు.
ఇక్కడ దాదాపు 80 ఎకరాల్లో పాటిగడ్డ (ఎత్తైన మట్టి దిబ్బ) ఉండేదని తెలిపారు. ఇప్పటికీ కొంత ఉన్న ఈ పాటిగడ్డలో ఎన్నో ఆధారాలు ఉంటాయని చెబుతున్నారు. గతంలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పురావస్తు శాఖ అధికారులు రెండు కుండలను ఇక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు రత్నాకర్. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వితే ఎన్నో విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.