ప్రజాదీవెన యాత్రతో నియోజవకర్గంలో పర్యటిస్తూ ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ కోరుతున్నారు. అధికార పార్టీ ధన దాహానికి బలి కావద్దని సూచిస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ధన ప్రవాహానికి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని సూచిస్తున్నారు. ఎక్కడలేని ప్రేమ సీఎం హుజురాబాద్ పై ఒలకబోస్తున్నారని చెబుతున్నారు. ఎన్ని వాగ్దానాలు చేసినా చివరికి మనదే విజయం అనే దీమాలో ఈటల ఉన్నారు.
ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుల్లో దేశిని కోటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న కోటి భార్య దేశిని స్వప్న కూడా తాను పార్టీ వీడుతున్నట్లు చెప్పడం కొసమరుపు. ఈటల ప్రధాన అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్ కు కూడా పార్టీ వీడేందుకు సిద్ధపడినట్లు సమాచారం. దీంతో బీజేపీని అభాసుపాలు చేసి తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న అధికార పార్టీ కుట్రలకు కిందిస్థాయినేతలు బలవుతున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ వేసిన ఉచ్చులో చిక్కుకుంటున్న నేతలను కాపాడే ప్రయత్నంలో బీజేపీ కూడా ఆలోచనలు చేస్తోంది. నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలా వరుస కట్టి నేతలు పార్టీకి గుడ్ బై చెబితే భవిష్యత్తు కష్టంగా మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. అందుకే నేతలను తమ దారి వదలకుండా ఉండేలా చేయడానికి వారిని మానసికంగా సంసిద్ధులను చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నికలో అపజయం భయంతోనే అధికార పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.