Aravalli Mining: మనదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతప్రాంతాలుగా ఆరావళి కి పేరుంది. ఈ పర్వతాలు అనేక రాష్ట్రాలలో విస్తరించాయి. ఇటీవల కాలంలో ఈ పర్వత శ్రేణిలో కేంద్ర ప్రభుత్వం కొత్త మైనింగ్ లీజులకు అనుకూలంగా నిబంధనలకు సూత్రీకరణ చేసింది.. ఎంతో పురాతనమైన ఈ పర్వతాలలో కేంద్రం తీసుకొచ్చిన విధానాలు, మైనింగ్ కు అనుకూలంగా ఉండడం పట్ల ఆందోళనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పర్యావరణవేత్తలు కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో అయితే అక్కడి ప్రజలు వేలాదిమంది రోడ్లమీదకి వచ్చి ఆందోళనలు చేశారు.
ఆరావళి పర్వతాలు ఢిల్లీలో కూడా విస్తరించాయి . ఇప్పటికే ఢిల్లీ ప్రాంతం కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. ఆ ప్రాంతం కాస్తలో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అంటే దానికి ప్రధాన కారణం ఆరావళి పర్వతాలే. అటువంటి విశిష్టత ఉన్న పర్వతాలలో మైనింగ్ కు అనుమతులు మంజూరు చేయడం పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి.
ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ బుధవారం స్పందించింది. ఈ పర్వత శ్రేణిలో కొత్త మైనింగ్ లీజు లను మంజూరు చేయడం పట్ల నిషేధం విధించింది. ఇకపై ఈ ప్రాంతంలో ఎటువంటి మైనింగ్ జరగదని కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించింది. బయోడైవర్సిటీని పరిరక్షించడంలో ఈ పర్వత ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని.. వాటి సంరక్షణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని వెల్లడించింది.
పురాతన ప్రాంతాలుగా పేరుపొందిన ఆరావళి పర్వతశ్రేణిలో మైనింగ్ కు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించింది. దీనిని వ్యతిరేకిస్తూ చాలామంది పర్యావరణ ప్రేమికులు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్పించింది. దీనికి సంబంధించి గత నెల 20న కీలకమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వచించిన విధానం ప్రకారం ఈ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ప్రాంతాలలో స్థానికంగా ఉన్న భూమట్టం నుంచి 100 మీటర్లు (328 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పేర్కొంటారు. ఇక్కడ మైనింగ్ చేయడం దాదాపుగా నిషేధం.
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున ప్రాంతాన్ని ఆరావళి పర్వతశ్రేణిగా గుర్తించరు. ఈ ప్రాంతాలలో మైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధన పై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అయింది.. చివరికి ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ పర్వత శ్రేణిలలో దాదాపు 91 శాతం పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. అందువల్లే పర్యావరణవేత్తలు ఆందోళనకు దిగారు. ఇక్కడ తవ్వకాలు గనక జరిగితే ఆ పర్వతాలు మొత్తం నామరూపాలు లేకుండా పోతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమం అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వెంటనే ఆ నిబంధనను వెనక్కి తీసుకుంది. అంతేకాదు, మైనింగ్ పై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.