APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ లేదు లేదంటూనే బాదుడు మొదలు పెట్టింది. రెండు నెలల వ్యవధిలో రెండో సారి టిక్కెట్ ధర పెంచింది. దీనికి డీజిల్ పై సెస్ అంటూ వక్రభాష్యం చెబుతోంది. రెండు నెలల కిందట ఇదే మాదిరిగా చెప్పుకొచ్చింది. గత రెండేళ్లలో కొవిడ్ ప్రభావంతో సంస్థకు తీరని నష్టం కలిగిందని.. అధిగమించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులపై భారం వేయడం లేదని చెప్పుకొచ్చింది. కేవలం డీజిల్ పై భారం మోయలేనందునే సెస్ వసూలు చేయాల్సి వస్తోందని చెబుతోంది. ఈ వింత వాదన అటుంచితే గ్రామీణ సర్వీసులు పల్లె వెలుగు నుంచి ఏసీ గరుడ బస్సు వరకూ రూ.20 నుంచి రూ.140ల వరకూ బాదేసింది. స్టేజ్ స్టేజ్ కి భారం మోపింది. టిక్కెట్ కనీస చార్జీలను పెంచి ప్రయాణికులపై భారం మోపింది. ఆర్టీసీలో ప్రయాణమంటే భయపడేటంతగా చార్జీలు పెరిగాయి. ఇదే అదనుగా ప్రైవేటు ఆపరేటర్లు భారీగా దోపిడీకి దిగే అవకాశముందని సుదూర ప్రాంతాలకు ప్రయాణం సాగించే వారు ఆందోళన పడుతున్నారు. అయితే పెంచిన చార్జీలు విషయంలో ఆర్టీసీ యాజమాన్యం వాస్తవాలు వెల్లడించడం లేదు. కేవలం డీజిల్ పై సెస్ నే సాకుగా చూపుతున్నాయి. బల్క్ గా డీజిల్ లీటరు ధర రూ.131లకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి బయట బంకుల్లో లీటరు ధర రూ.100లు ఉంది. కానీ అదనపు ధర చెప్పి ప్రజలను మాయచేసే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రామీణ సర్వీసులను కనికరించలే..
ఆర్టీసీలో గ్రామీణ సర్వీసులు అధికం. కనీస టిక్కెట్ ధర రూ.5గా ఉండేది. రెండు నెలల కిందట దానిని రూ.10కి పెంచారు. ఇప్పుడు కనీస చార్జీ పెంచలేదని చెబుతునే..30 కిలోమీటర్ల దాటితే మాత్రం బాదుడుకు తెరదీశారు. దూరాన్ని బట్టి రూ.5 నుంచి రూ.20 వరకూ పెంచారు. ఆల్ట్రా పల్లె వెలుగుదీ సేమ్ పరిస్థతి రూ.25 వరకూ వడ్డించారు. ఎక్స్ ప్రెస్ కు 35 కిలోమీటర్ల వరకూ మినహాయింపు ఇచ్చినట్టే ఇచ్చి..రూ.5 నుంచి రూ.75 వరకూ పెంచేశారు.
Also Read: Telangana Politics : టీఆర్ఎస్+కాంగ్రెస్ డౌన్.. బీజేపీ పైపైకి..
ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల అయితే రూ.120 నుంచి రూ.145 వరకూ బాదుడే. ఏసీ సర్వీసుల గురించి చెప్పనక్కర్లేదు. అయితే గ్రామీణ సర్వీసులకు మినహాయించి.. ఇతర సర్వీసుల విషయంలో కనికరం లేకుండా ఎడాపెడా వాతలు పెట్టారు. సాధారణంగా ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో సుదూర ప్రాంతానికి వెళ్లే వారు ప్రయాణిస్తుంటారు. అటువంటి వారిని టార్గెట్ చేసుకుంటూ టిక్కెట్ చార్జీలు భారీగా పెంచారు. డీజిల్ సెస్ రూపంలో పెద్దనగరాల మధ్య ఉండే స్టేజీలను బట్టి టిక్కెట్ ధరలను పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సంస్థ ఆర్థిక పరిస్థితి ద్రుష్ట్యా పెంచుతున్నట్టు ప్రకటిస్తే సరిపోయేదని.. దీనికి డీజిల్ పై సెస్ అంటూ చెప్పడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తెలంగాణ మాదిరిగా..
తెలంగాణాలో సైతం ఇదే మాదిరిగా డీజిల్ పై సెస్ అంటూ ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచారు.అందుకే తెలంగాణా ప్రజలు హైదరాబాద్ రావాలంటే ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్నాటక బస్సులను ఆశ్రయించారు. దీంతో తెలంగాణా ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వు జారీచేసింది. అంతర్ రాష్ట్ర రవాణా ఒప్పందం ప్రకారం బస్సులు తిరిగే ప్రాంతంలో ఒకేలా చార్జీలు ఉండాలన్నది దాని సారాంశం. అయితే చార్జీలను పెంచే ఉద్దేశ్యం తమకు లేదని ఏపీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. దీంతో ఇప్పట్లో చార్జీల పెంపు ఉండదని అంతా భావించారు. కానీ దానిని తెరదించుతూ ఏపీఎస్ ఆర్టీసీ బాదుడుకు తెరతీసింది.
Also Read:Manipur Landslide: ప్రపంచంలోని ఏ సైనికులకు లేనిది మనకే ఎందుకు?