
ఏపీ సర్కారు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని నిరుద్యోగుల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. జగన్ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత నిరసన పెరిగిందనే అభిప్రాయం ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ.. అందులో ఆశించినమేర జాబులు లేవని, అది జాబ్ లెస్ క్యాలెండర్ అనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే.. ఏపీపీఎస్సీ విషయంలో సర్కారు తీసుకున్న గత నిర్ణయాలు ఇప్పుడు వివాదం రేపే అవకాశం కనిపిస్తోంది.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గ్రూప్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్షల నిర్వహణ తర్వాత కొత్త సర్కారు ఫలితాలను నిలిపేసింది. ఆ తర్వాత మూల్యాంకనంలో మార్పులు చేసిందనే వార్తలు వచ్చాయి. అనంతరం అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది ప్రభుత్వం. అయితే.. దీనిపై అభ్యంతరం తెలుపుతూ పలువురు కోర్టుకు వెళ్లారు. ఏపీపీఎస్సీ అక్రమాలకు పాల్పడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో.. ఇంటర్వ్యూలను నిలిపేస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ విచారణలో భాగంగా.. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయన అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వం తన పని తనను చేసుకోనివ్వలేదని, ఆఫీసుకు సైతం రానివ్వలేదని పేర్కొన్నారు. తనకు చాంబర్ తోపాటు కనీసం అటెండర్ ను కూడా ఇవ్వలేదని న్యాయస్థానానికి వివరించారు.
తన విధులకు ఆటంకం కలిగించారని, నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు పెట్టి నిర్ణయాలు తీసుకున్నారని కూడా పేర్కొన్నారు. మొత్తంగా.. ఆ నిర్ణయాలేవీ తన ఆమోదంతో జరగలేదని తేల్చి చెప్పారు. ఈ విషయమై తాను గతంలో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో.. ఈ వ్యవహారంలో దుమారం చెలరేగే పరిస్థితి వచ్చింది.
ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి రాజ్యాంగబద్ధమైనది.అందువల్ల ఆ పదవిలో ఉన్న ఉదయ భాస్కర్ ను తొలగించలేక.. ఆయనకు ఎవరూ సహకరించకుండా సర్కారు ఇతర ప్రయత్నాలు చేసిందనే విమర్శలు గతంలోనే వినిపించాయి. మరో సభ్యుడితోనే వివరాలన్నీ చెప్పిస్తూ వచ్చారు. దీంతో.. ఏపీపీఎస్సీలో ఏదో జరుగుతోందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయభాస్కర్ అఫిడవిట్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని పని చేసుకోనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడిందని చెప్పడం చిన్న విషయమేమీ కాదు. పైగా.. నిరుద్యోగుల భవితవ్యానికి సంబంధించిన విషయం కూడా. మరి, దీనిపై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది? రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అన్నది చూడాలి.