వెనకటికి ఒకాయన ఉండేవాడట. నావి కాకపోతే.. తిరుపతి కొండను మోకాళ్లతో ఎక్కేస్తా అన్నాడట! ఇప్పుడు ఆంధప్రదేశ్ మంత్రి శైలికూడా అలాగే ఉందని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల విరాళం ఇచ్చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ మొత్తాన్ని డొనేట్ చేశారు. ఇంత పెద్ద మొత్తం ఇచ్చిన తర్వాత కవరేజీ ఎలా ఉంటుంది మరీ? అద్దిరిపోయింది. పబ్లిక్ రిలేషన్ బాధ్యతలు చూసే వారు ఓ రేంజ్ లో పబ్లిసిటీ ఇచ్చేశారు.
కానీ.. అసలు విషయం ఏమంటే ఆ మొత్తం.. పెద్దిరెడ్డి బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చినవి కాదు. అసలు ఆ డబ్బులు ఆయనవి కానేకాదు. ప్రభుత్వానివే! ఆయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఖనిజాభివృద్ధి సంస్థ నిధులవి! ప్రధాన ఖాతా నుంచి రూ.10 కోట్లు, జిల్లాల పరిధి నుంచి రూ.90 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేశారు. ఇది తెలియని వారంతా.. పెద్దిరెడ్డి రూ.100 కోట్లు విరాళం ఇచ్చారా? అని మొదట ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తంచేశారు. ఆ తర్వాత నిజం తెలుసుకొని రెట్టింపుగా నిట్టూర్చారు!
ఖనిజాభివృద్ధి సంస్థ అంటే ప్రభుత్వానిదే. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రభుత్వానిదే. అంటే.. ఒక సర్కారు ఖాతా నుంచి మరో సర్కారు అకౌంట్ కు డబ్బు ట్రాన్స్ ఫర్ చేశారన్నమాట. ఈ కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరగడం.. అందరూ చప్పట్లు కొట్టడం.. ఫొటోలు తిగడం అన్నీ జరిగిపోయాయి.
అసలే సర్కారు ఖజానా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. ఇప్పడు సెకండ్ వేవ్ వచ్చి పరిస్థితి మరింతగా దిగజార్చింది. ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి వేల కోట్లు కావాల్సి ఉంది. ఇక, నెలవారీ ఖర్చులు మామూలే. దీంతో.. విరాళాల సేకరణ మొదలు పెట్టింది సర్కారు. అయితే.. బయటి నుంచి వచ్చేది పెద్దగా కనిపించలేదు. దీంతో.. ప్రభుత్వ శాఖల నుంచే నిధులు సమకూర్చుకునే పని మొదలు పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి వంద కోట్లను సమర్పించారని తెలుస్తోంది.