
తెలంగాణ, ఏపీ జల వివాదాల్లో కేంద్రం జోక్యం అనివార్యమైంది. ఏపీ విన్నవించిన నేపథ్యంలో గోదావరి, కృష్ణా బోర్డులను నోటిఫై చేస్తూ కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దీంతో ప్రాజెక్టులన్నీ ఇక కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇక తెలుగు ప్రాంతాల్లో ఏ పని చేయాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే. నోటిఫికేషన్లో చెప్పినంత మాత్రాన అనుమతులు ఇచ్చినట్లు కానది చెబుతున్నారు. అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపేయాల్సిందే అన్నారు. ఏపీ పదేపదే కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోనే కేంద్రం తన పరిధిలోకి తీసుకుందని పేర్కొంటున్నారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఇంకా స్పందించలేదు. ఏపీ చేసిన పనితోనే ప్రాజెక్టులపై కేంద్రం జోక్యం కల్పించుకోవడం జరిగిందని తెలిసినా ఎలాంటి వైఖరి వెల్లడించలేదు అయితే తాము కోపంగా ఉన్నట్లు తెలియజేస్తోంది. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని చెబుతున్నారు. వీలైనంత త్వరలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తామని వివరించారు.
జల వివాదాల్లో కేంద్ర జోక్యంతో పనులు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు ఏ పని ముందుకు సాగకపోయినా కేంద్రంపైనే నెపం పెట్టే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు పూర్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పైకి వ్యతిరేకత చూపిస్తున్నా తెలంగాణ సర్కారుకు కొత్తగా అభివృద్ధిపై ఆశలు మాత్రం పెరుగుతున్నాయి.
తెలుగు స్టేట్ల స్వయం కృతాపరాధంతోనే కేంద్రం జోక్యం కల్పించుకుంది. రెండు ప్రాంతాలు సామరస్యంగా మాట్లాడుకుంటే పోయే సమస్యను ఢిల్లీ దాకా తీసుకెళ్లారు. ఫలితంగా రెండు విధాలా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పనికైనా కేంద్రం కనుసన్నల్లోనే చేయాల్సి రావడంతో పనులు కాస్త నెమ్మదించే ప్రమాదం పొంచి ఉంది. ఏదిఏమైనా చివరికి కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.