AP SI Recruitment 2023: ఎస్సై నియామక ప్రక్రియ పై ఏపీ హైకోర్టు స్టే.. కారణం అదే

రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐల కొరత అధికంగా ఉంది. ఏ జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో ఎస్సైలు లేరు. దీంతో శాంతిభద్రతల అంశంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Written By: Dharma, Updated On : November 17, 2023 5:06 pm

AP SI Recruitment 2023

Follow us on

AP SI Recruitment 2023: ఏపీ సర్కార్కు హైకోర్టులో షాక్ తగిలింది. ఎస్సై నోటిఫికేషన్ పై స్టే విధించింది. నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించక పోవడాన్ని తప్పు పట్టింది. దీంతో ఎస్సై నియామక ప్రక్రియ నిలిచిపోయింది. వేలాదిమంది అభ్యర్థులు నిరాశలో కూరుకు పోయారు. ప్రభుత్వం వెల్లడించిన నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్నా కొందరు అభ్యర్థులకు అన్యాయం జరగడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్సై నియామక ప్రక్రియను నిలిపివేస్తూ స్టే విధించింది.

ఎస్సై నియామక ప్రక్రియ పై ఏపీ హైకోర్టు స్టే.. కారణం అదే

కొద్ది నెలల కిందట ఏపీ ప్రభుత్వం ఎస్ఐ నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పోస్టులను భర్తీ చేయాలని భావించింది. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని.. అన్ని అర్హతలు ఉన్నా తమను అనర్హులుగా ప్రకటించారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. బాధితుల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఎత్తు అంశంలో కొందరు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఎత్తు అంశంలో అర్హత సాధించిన వారిని.. ఇప్పుడు అనర్హులుగా ప్రకటించారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే ఇది ఎలా సాధ్యమని న్యాయమూర్తి రిక్రూట్మెంట్ బోర్డును ప్రశ్నించారు. అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది కాబట్టి వెంటనే ఎస్ఐ నియామక ప్రక్రియను నిలిపివేయాలని బాధితుల తరపు న్యాయవాది కోరారు.

ఈ కేసులో వాద ప్రతి వాదనలు నిన్న న్యాయమూర్తి నోటిఫికేషన్ పై స్టే విధించారు. విచారణను వాయిదా వేశారు. తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆదేశించారు. హైకోర్టు నిర్ణయంతో ఎస్సై ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. నోటిఫికేషన్ వెల్లడించినప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి న అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐల కొరత అధికంగా ఉంది. ఏ జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో ఎస్సైలు లేరు. దీంతో శాంతిభద్రతల అంశంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం సైతం ఏటా నియామక ప్రక్రియ చేపడుతామని చెప్పినా అమలు చేయలేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అని వారు పరిస్థితి ఎదురైంది. దీంతో కొద్ది నెలల కిందటే 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి ఏపీ హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇందుకు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించింది. సెప్టెంబర్ లో అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు కూడా పూర్తయ్యాయి. ఇందులో అర్హత సాధించిన వారికి అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఈ తరుణంలో హైకోర్టు నియామక ప్రక్రియ పై స్టే విధించడం విశేషం. కోర్టు తదుపరి తీర్పు ఎలా వస్తుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.