
కరోనా వైరస్ సోకినా వారికి నాణ్యమైన సేవలను ఒకే చోట కేంద్రీకరించి ఇచ్చేందుకు, ఆసుపత్రులలో ఇతరులకు ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోంది. రాష్ట్రంలోని నాలుగు ప్రముఖ ఆసుపత్రులలో ఈ వైద్య సేవలను కేంద్రీకరించి, రోగులు అందరిని ఇక్కడికే చేర్చేందుకు సిద్ధం చేస్తున్నది.
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల (ఇక్కడ వైరాలజీ ల్యాబ్ కూడా ఉంది), నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల, విశాఖపట్నంలోని విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్), తిరుపతిలోని ఎస్వీఎంసీ (రుయా)లను పూర్తిగా కరోనా వైద్యానికే కేటాయిస్తున్నారు. ఈ ఆసుపత్రులను కరోనా కేసులకు మాత్రమే చికిత్స కోసం వినియోగించడం ద్వారా సాధారణ రోగులకు ఈ వైరస్ సోకకుండా చేయవచ్చని చూస్తున్నారు.
ఈ నాలుగు కాలేజీల్లో కరోనా వైద్యానికి 4 వేలకు పైగా పడకలు గురువారం నాటికి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రులలో అందిస్తున్న ఇతర వైద్య సేవల కోసం ప్రజలను సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు వేలమంది సూచిస్తున్నారు. కరోనా చికిత్సకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఇతరత్రా ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, అత్యవసర సేవల నిలిపివేస్తున్నారు.
ఇలా ఉండగా, ఏపీలో కరోనా రోగుల సంఖ్య 10 కి పెరిగింది. బుధవారం విజయవాడ, గుంటూరుకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా రావడంతో ఈ సంఖ్యా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అనుమానిత లక్షణాలున్న 312 మంది నుంచి నమూనాలు సేకరించి వైద్యపరీక్షలకు పంపించారు.
అందులో 229 నెగిటివ్ కాగా మరో 73 నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. బుధవారం ఒక్కరోజు 13 నమూనాలు పంపించారు. రాష్ట్రంలో హోం క్వారంటైన్‌లో ప్రస్తుతం 15,143 మంది ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ గత రాత్రి తెలిపింది.