Chandrababu: అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ ను బ్రతికించేందుకు ఆ పార్టీ యువనేత రాహూల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్రను దిగ్విజయంగా పూర్తిచేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ పార్టీ కంటే తక్కువ, ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ అన్న రీతిలో ఉంది. దేశాన్ని సుదీర్ఘ కాలం ఏలిన ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ జోడో యాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారం రావడం ఎంత ముఖ్యమో.. ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ ముందున్న లక్ష్యం. అందుకే విపక్షాల మధ్య ఐక్యతను ఆయన కోరుకుంటున్నారు. జోడో యాత్ర ముగింపునకు దేశ వ్యాప్తంగా ఉన్న 21 పార్టీలకు ఆహ్వానాలు పంపారు. ఆ జాబితాలో తెలుగుదేశం పార్టీ ఉండడం విశేషం. అయితే సమావేశానికి హాజరు విషయంలో చంద్రబాబు ఎటువంటి స్పష్టతనివ్వడం లేదు.

ప్రస్తుతం చంద్రబాబు జాతీయ స్థాయిలో తటస్థంగా ఉన్నారు. కానీ ఆయన మనసంతా ఎన్టీఏ వైపే ఉంది. అటు గత ఎన్నికల్లో యూపీఏకు సపోర్టు చేసిన ఆయన ఎన్నికల తరువాత మాత్రం సైలెంట్ అయ్యారు. యూపీఏతో తెగతెంపులు చేసుకున్నట్టు అస్సలు ప్రకటించలేదు. బహుశా ఆ మమకారంతోనే రాహుల్ జోడయాత్ర ముగింపునకు చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. గత ఎన్నికల్లో ప్రధాని మోదీని గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా చంద్రబాబు ప్రచారం చేశారు. ఒకానొక సమయంలో రాహుల్ ను ప్రధాని చేయాలన్న ప్రతిపాదన కూడా తెచ్చారు. కానీ ఇప్పుడదే రాహుల్ ఆహ్వానం పంపినా స్పందించేందుకు చంద్రబాబు సాహసించడం లేదు.
అయితే చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎన్నో కూటముల్లో పాలుపంచుకున్నారు. కానీ ఎన్టీఏలోనే ఎక్కువ రోజులు గడిపారు. ఒక్క ఏన్టీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే సహేతుకమైన కారణాలు చెప్పి బయటపడుతున్నారు. కానీ అవసరాల కోసం చేసుకున్న కూటములు వర్కవుట్ కాకపోయేసరికి వాటి గురించి పట్టించుకోవడం లేదు. కనీసం ప్రకటన చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిపి మహాకూటమి ఏర్పాటుచేశారు. కానీ అక్కడ నిరాదరణే ఎదురైంది. 2019 ఎన్నికల్లో ఏకంగా జాతీయస్థాయిలోకాంగ్రెస్ తో పనిచేశారు. ఏపీలో కాంగ్రెస్ సహకారం తీసుకున్నారు. అయినా ఓటమే ఎదురైంది. క్రమంగా యూపీఏకు దూరమయ్యారు. అయితే దీనిపై ఎప్పుడూ స్పష్టమైన ప్రకటన చేసింది లేదు.

తాజాగా రాహుల్ జోడో యాత్ర ఆహ్వానం ఎలా స్పందించాలో తెలియడం లేదు. టీడీపీకి ఆహ్వానమున్నట్టు సాక్షాత్ ఆ పార్టీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ గూటికి చేరాలన్న తలంపులో ఉన్నారు. అందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. ఎన్నివిధాలా చేయాలో అన్ని విధాలుగా పాకులాడుతున్నారు. ఈ సమయంలో రాహుల్ జోడో యాత్రపై స్పందిస్తే అసలుకే ఎసరు వస్తుందని భయపడుతున్నారు. పైగా ఆంధ్రజ్యోతిలో కథనం వస్తే ఆలోచించదగ్గ విషయమే. విపక్షాలన్నీ ఒకేతాటిపైకి వస్తున్నాయని బీజేపీకి ఎమోషనల్ బ్లాక్ చేయడానికి, ఒత్తిడి పెంచేందుకేనన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఎలా స్పందించాలో తెలియక చంద్రబాబు రాహుల్ జోడోయాత్ర ముగింపు సభపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.