Nara Lokesh Padayatra: యువనేత నారా లోకేష్ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ లైట్ తీసుకుంటోందా? చంద్రబాబు పాదయాత్ర మాదిరిగా సీరియస్ గా తీసుకోవడం లేదా? డబ్బులు ఖర్చుపెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారా? 400 రోజుల పాటు ఖర్చులు తలకు మించిన భారంగా పరిగణిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. మొదటి రోజు ఉన్నంత ఉత్సాహం, సందడి రోజులు గడిచే కొలదీ తక్కువ అవుతోంది. ప్రారంభం రోజున రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అటు అనుబంధ విభాగాల ప్రతినిధులు, చివరకు చాలామంది ఎన్ఆర్ఐలు సైతం విచ్చేశారు. దీంతో ప్రారంభం అదిరిపోయింది. అయితే ఆ ఉత్సాహం చివరి వరకూ ఉంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పై ఉంది.

లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు నడవనున్నారు. అంటే దాదాపు ఏడాదికిపైగా లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. టీడీపీకి ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకం. లోకేష్ ను భావి నాయకుడిగా చూపించేందుకు ఇదో వేదికగా చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించిన నాటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే చంద్రబాబు పాదయాత్రలో చేపట్టిన ఫార్ములా ఇప్పుడు మిస్సవుతుండడమే అసలు లోపం. నాడు చంద్రబాబు పాదయాత్ర చేసే సమయంలో పార్టీకి గడ్డుకాలం. అప్పటికే రెండుసార్లు వరుస ఓటమితో జీవన్మరణ సమస్య. అందుకే పార్టీ శ్రేణులు నాడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
నాటి చంద్రబాబు యాత్రలో రెండు ఫార్ములాలకు పెద్దపీట వేశారు. ఒకటి ప్రచారం, రెండూ జన సమీకరణ. దాదాపు ఏపీలోని అన్ని మీడియా సంస్థలు పాదయాత్ర కవరేజ్ చేసేలా ప్లాన్ చేశారు. పెద్ద చానళ్ల నుంచి సిటీకేబుల్ వరకూ అందరికీ యాడ్లు ఇచ్చేవారు. అటు నియోజకవర్గాల బాధ్యులు జన సమీకరణ చేసేవారు. అందుకు అయ్యే ఖర్చులు అంతా వారే భరించేవారు.

కానీ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర అనుకూల మీడియా తప్పించి.. మిగతా వాటిలో కవరేజ్ కావడం లేదు. యాడ్ల రూపంలో ప్యాకేజీ లేకపోవడమే ఇందుకు కారణం. అటు జన సమీకరణ కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నియోజకవర్గ ఇన్ చార్జిలు ఖర్చుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు, రాష్ట్రానికి ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలకు ఖర్చుపెట్టడంతో.. ఇక భరించలేమన్న రీతిలో ఉన్నారు. అయితే ఈ లోపాలన్నీ అధిగమించకుంటే మాత్రం లోకేష్ పాదయాత్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.