AP Politics: ఏపీలో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తోంది. టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి రావడం పక్కాగా తేలుతోంది.దీంతో అందరి దృష్టి ఏపీపై పడుతోంది. అటు నేషనల్ మీడియా, సర్వే సంస్థల లెక్కలు మారుతోంది. ఇప్పటివరకు వైసీపీ విజయం ఖాయమని సర్వేలు తేల్చి చెప్పాయి. కానీ ఇప్పుడు టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అయితే ఏపీ విషయంలో జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బిజెపి కూటమిలోకి వస్తుంది. షర్మిలకు పిసిసి పగ్గాలు అందించడం ద్వారా జగన్ ను గద్దె దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. వామపక్షాలు సైతం జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ పరిణామ క్రమంలో ఏపీ ప్రజల నాడి మారుతోంది. అందుకే సర్వే సంస్థలు గొంతులను సవరించుకుంటున్నాయి.
ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే. దశాబ్దాలుగా ఆ పార్టీ ఏపీలో సత్తా చాటాలని చూస్తోంది. కానీ వీలు పడడం లేదు. గత ఎన్నికల్లో నోటా కంటే బిజెపికి తక్కువ ఓట్లు వచ్చాయి. 0.8 ఓట్లు మాత్రమే లభించాయి. అయినా చంద్రబాబు పొత్తు కోసం ఎందుకు వెంటపడుతున్నారంటే.. ఎన్నికల్లో వ్యవస్థల పరంగా బిజెపి మద్దతు ఉంటుందని.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుందని అంచనా వేసి చంద్రబాబు పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. అదే సమయంలో బిజెపి కలిసి రావడం వల్ల రెండు నుంచి మూడు శాతం ఓట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
టిడిపి, బిజెపిల స్నేహం ఇప్పటిది కాదు. చాలాసార్లు ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయి. కలిసే పోటీ చేశాయి. అప్పట్లో 3 నుంచి 5% ఓట్లు బిజెపికి లభించేవి.కానీ గత ఎన్నికల్లో ఓటు శాతం పడిపోవడానికి ప్రధాన కారణం.. చంద్రబాబు పై ఉన్న కోపమే. సరిగ్గా ఎన్నికల ముంగిట ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తో చేతులు కలిపారు. దీంతో మోడీపై విపరీతంగా అభిమానం ఉన్న తటస్తులు, విద్యాధికులు వైసీపీ వైపు మొగ్గు చూపారు. బిజెపి గెలవదు కాబట్టి.. ఆ పార్టీకి ఓట్లు వేసిన వృధా అని భావించి వైసిపి కి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. అటు బిజెపి శ్రేణులు సైతం చంద్రబాబును ఓడించేందుకు వైసీపీకి ఓటు వేశాయి. అందుకే నోటా కంటే తక్కువ ఓట్లు లభించాయి.
ఇప్పుడు టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి వస్తే.. తటస్తులు, మోదీని అభిమానించేవారు ఉమ్మడి అభ్యర్థులకు తప్పకుండా ఓటు వేస్తారు. ఈ లెక్కనే ఇప్పుడు కూటమి బలం పెరగనుంది. గతంలో కూడా టిడిపి, బిజెపి కలిసి పోటీ చేసినప్పుడు రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగేది. ఇప్పుడు కూడా అలానే జరిగితే బిజెపి ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. అది సక్రమంగా బదలాయింపు జరిగితే కూటమిదే ఆధిపత్యం. ఇప్పుడు సర్వేలు సైతం దీనినే లెక్కలోకి తీసుకుంటున్నాయి. మొన్నటి వరకు ఓటు శాతంతో వైసిపి ముందంజలో ఉండగా.. ఇప్పుడు కూటమిపరంగా ఓటు శాతాన్ని లెక్కించి ఇటువైపు మొగ్గు చూపుతున్నాయి.