https://oktelugu.com/

US Citizenship: 59,000 మంది భారతీయులకు అమెరికన్ పౌరసత్వం

సాధారణంగా అమెరికాలో ఐదు సంవత్సరాలపాటు చట్టబద్ధమైన నివాసం ఉన్నవారు అమెరికన్ పొందేందుకు అర్హులు. అమెరికన్ పౌరులను జీవిత భాగస్వామిగా చేసుకున్నప్పటికీ కనీసం మూడు సంవత్సరాలు పాటు వారు అక్కడ శాశ్వతంగా ఉండాలి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 12, 2024 / 12:53 PM IST
    Follow us on

    US Citizenship: ఉద్యోగాలు పోతుండడం.. కొత్త ఉద్యోగాలు లభించకపోవడం.. ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరగడం.. ఉన్నత చదువుల నిమిత్తం వస్తున్న వారి పై ట్యూషన్ ఫీజుల భారం పెంచడం.. వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారత పౌరులకు అమెరికన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 59 వేల మంది భారత పౌరులకు తమ దేశ పౌరసత్వం అందించినట్టు అమెరికన్ ప్రభుత్వం పేర్కొన్నది. “అమెరికా పౌరసత్వం, వలస సేవల నివేదిక ” ప్రకారం మెక్సికో తర్వాత భారతదేశ పౌరులకు తమ పౌరసత్వాన్ని అందించినట్టు అమెరికా పేర్కొన్నది. సెప్టెంబర్ 30 , 2023 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు అమెరికన్ పౌరసత్వం పొందారు. అయితే అత్యధికంగా మెక్సికో నుంచి 1.1 లక్షల మంది అమెరికన్ పౌరసత్వం పొందారు. ఆ తర్వాత భారత్ నుంచి 59,100 మంది అమెరికా పౌరసత్వం పొందారు. అమెరికా దేశానికి సంబంధించి పౌరసత్వం పొందాలి అంటే కనీసం ఐదు సంవత్సరాల పాటు చట్టబద్ధమైన శాశ్వత నివాసం అవసరం. అమెరికన్ పౌరుల జీవిత భాగస్వాములు లేదా సైనిక సేవలో ఉన్న వారికి అమెరికన్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇస్తుంది. ఇక 2023 సంవత్సరంలో ఎక్కువ మంది కొత్త పౌరులు ఐదు సంవత్సరాల పాటు చట్టబద్ధమైన శాశ్వత నివాసతులుగా ఉండటం వల్ల వారు అమెరికన్ పౌరసత్వానికి అర్హత సాధించారు. వీరిలో కొంతమంది అమెరికాకు చెందిన పౌరులను వివాహం చేసుకున్నవారు, అమెరికన్ సైనిక సేవలో ఉన్నవారు కూడా ఉన్నారు.

    సాధారణంగా అమెరికాలో ఐదు సంవత్సరాలపాటు చట్టబద్ధమైన నివాసం ఉన్నవారు అమెరికన్ పొందేందుకు అర్హులు. అమెరికన్ పౌరులను జీవిత భాగస్వామిగా చేసుకున్నప్పటికీ కనీసం మూడు సంవత్సరాలు పాటు వారు అక్కడ శాశ్వతంగా ఉండాలి. ఇక 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికా చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి సగటు వ్యవధి ఏడు సంవత్సరాలుగా అమెరికా నిర్ణయించింది. వాస్తవానికి పొరుగు పౌరుల సేవల మీదనే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. కాకపోతే అక్కడ పెరుగుతున్న నిరుద్యోగం వల్ల స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికైన ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో.. శాశ్వత పౌరసత్వం విషయంలో అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. స్థానికులకే ఉద్యోగాలు అనే హామీ వల్ల అమెరికాకు ఉపాధి నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుంది. అక్కడి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అమెరికాలో ఉపాధి నిమిత్తం ఉండే వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందువల్లే అక్కడ నిరుద్యోగం రేటు పెరిగిపోతుంది. మరి ఈ నేపథ్యంలో తదుపరి ఆర్థిక సంవత్సరం సంబంధించి అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంది.

    కాగా, కొంతకాలంగా అమెరికాలో తయారీ రంగం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.. ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో చాలావరకు సంస్థలు తయారీని తగ్గించాయి. వస్తు సేవలకు డిమాండ్ తగ్గిపోవడంతో ఉత్పత్తి కూడా మందగించింది. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులపై సంస్థలు వేటు వేస్తున్నాయి. ఇది కూడా అమెరికాలో నిరుద్యోగం పెరగడానికి ఒక కారణం అవుతున్నది. ఎన్నికైన ప్రభుత్వాలు తయారీ రంగం మీద ఎక్కువగా దృష్టి సారించకపోవడం.. స్థానికంగా ఉన్న కార్మిక చట్టాలు ఆయా సంస్థల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల పేరుపొందిన బడా సంస్థలు ఇతర దేశాల్లో తమ తయారీ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యల పరిష్కారం కోసం అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.. ఇదే సమయంలో పౌర సేవలో మరింత మెరుగుదలను సాధించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ ఆర్థిక శక్తి బలంగా మారడానికి ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులే కారణం కావడంతో ఈసారి శాశ్వత పౌరసత్వం ఇచ్చే విషయంలో అమెరికా కాస్త చొరవ చూపినట్టు కనిపిస్తోంది.