https://oktelugu.com/

BRS Vs Congress : సై అంటే సై.. ఢీ అంటే ఢీ.. నేటి అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌

అసెంబ్లీలో సోమవారం నీటిపారుదల శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు, చేపిన పనులే లక్ష్యంగా ఈ ప్రజెంటేషన్‌ ఉంటుందని తెలుస్తోంది.

Written By: , Updated On : February 12, 2024 / 12:41 PM IST
Follow us on

BRS Vs Congress : తెలంగాణ అసెంబ్లీ సమావేశం సోమవారం (ఫిబ్రవరి 12న) గరం గరంగా సాగనుంది. కృష్ణాలో తెలంగాణ నీటి వాటాను బీఆర్‌ఎస్‌ ఏవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెట్టిందో పవర్‌పాయింట్‌ప్రజెంటేషన్‌ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలో సూచించారు. ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. నీటిపారుదల శాఖపై సమగ్రంగా చర్చించారు.

-సెంటిమెంట్‌ పేరిట..
సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కృష్ణా జలాల ఒప్పందాలు, ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా ఎంత ఉండాలి, ఎంతకు ఒప్పందం చేసుకున్నారు. తదితర అంశాలపై తెలియజేసినట్లు చెప్పారు. కేసీఆర్‌ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని ఓట్ల కోసం నీటి రాజకీయాలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో సోమవారం తమ ప్రశ్నలకు బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

-జగన్‌తో కుమ్మక్కు..
తెలంగాణ నాటి సీఎం ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేశారని ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. కృష్ణా జలాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని తెలిపారు. జగన్, కేసీఆర్‌ మాట్లాడుకునే నాగార్జునసాగర్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారని ఆరోపించారు. కేసీఆర్‌ చర్యలు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

-శ్వేతపత్రం సిద్ధం..
అసెంబ్లీలో సోమవారం నీటిపారుదల శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు, చేపిన పనులే లక్ష్యంగా ఈ ప్రజెంటేషన్‌ ఉంటుందని తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ కూడా ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రతివ్యూహంతో అసెంబ్లీకి రాబోతోంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు మరింత వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.