
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రధాని మోడీ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకూ పొడిగించారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం లాక్ డౌన్ ను కొన్ని ప్రాంతాల వరకే పరిమితం చేయాలని, మిగిలిన ప్రాంతాలను లాక్ డౌన్ కు మినహాయింపు ఇవ్వాలని భావించారు, ఇదే విషయాన్ని ప్రధానికి సైతం వివరించారు. రాష్ట్రంలో 676 మండలాలు ఉండగా కరోనా వైరస్ సోకిన మండలాల్లో 37 రెడ్‌జోన్‌లో, ఆరెంజ్ జోన్లో 44 మండలాలు ఉన్నాయి. అంటే 676 మండలాల్లో మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్‌లో ఉన్నవి కేవలం 81 మాత్రమే. మిగిలిన 595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదనేది సీఎం వాదన.
ప్రతిపక్ష పార్టీలు ఈ వాదనను పూర్తిగా వ్యతిరేకించాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నాయకులు ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో కరోనా వ్యాప్తిని నివారించడం సాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేప రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లాక్ డౌన్ పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు స్వయంగా సీఎం, గవర్నర్ కు లేఖలు రాశారు. సీపీఐ కూడా ఇదే వాదన వినిపించింది. లాక్ డౌన్ పొడిగించడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. లాక్ డౌన్ పొడిగించి గ్రీన్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అవకాశం కల్పించాలన్నారు.
ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం మాత్రం లాక్ డౌన్ పొడిగింపు పట్ల సుముఖంగా లేరు. ప్రధాని ప్రకటనకు ముందు రోజు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో కూడా రెడ్, ఆరెంజ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేస్తే బాగుంటుందని చెబుతూ, మీ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమేనాని పేర్కొన్నారు. సీఎం ఈ నిర్ణయానికి రావడానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఈ నెల 28 నుంచి విశాఖపట్నం రాజధానిగా పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉండటమేనని తెలుస్తోంది.
ప్రధాని మోడీ లాక్ డౌన్ వచ్చే నెల 3వ తేదీ వరకూ పొడిగిస్తూ ప్రకటన చేయడంతో ప్రతిపక్ష పార్టీల పంతమే నెగ్గినట్లయ్యింది. అధికార పక్షం ఎన్ని ఎత్తులు వేసినా ఈ విషయంలో వెనుకడుగు వేయక తప్పలేదు. రాష్ట్రంలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులు సంఖ్య నిన్నటి నుంచి పెరగడంతో ప్రజలు సైతం ప్రధాని సరైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు.