ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

ఆంధ్రా న్యూస్ చానెళ్ల పని ఖతమవుతోంది. జనాలు క్రమంగా వాటికి దూరం జరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాసులు కూడా తమ ప్రాంత చానెళ్లను చూడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో ఉండి ఆంధ్రా వార్తలు వండి వారుస్తున్న ఆ ప్రాంత న్యూస్ చానెళ్లకు ఇప్పుడు గడ్డు కాలం ఎదురైంది. మొన్నటి వరకు పోటీపోటీగా పోటీపడ్డ ఆంధ్రా చానెళ్లను ఇప్పుడు తెలంగాణ చానెళ్లు వెనక్కి నెట్టడం షాక్ కు గురిచేస్తోంది. అనూహ్యంగా తెలంగాణ […]

Written By: Neelambaram, Updated On : May 12, 2020 7:38 am
Follow us on


ఆంధ్రా న్యూస్ చానెళ్ల పని ఖతమవుతోంది. జనాలు క్రమంగా వాటికి దూరం జరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాసులు కూడా తమ ప్రాంత చానెళ్లను చూడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో ఉండి ఆంధ్రా వార్తలు వండి వారుస్తున్న ఆ ప్రాంత న్యూస్ చానెళ్లకు ఇప్పుడు గడ్డు కాలం ఎదురైంది. మొన్నటి వరకు పోటీపోటీగా పోటీపడ్డ ఆంధ్రా చానెళ్లను ఇప్పుడు తెలంగాణ చానెళ్లు వెనక్కి నెట్టడం షాక్ కు గురిచేస్తోంది. అనూహ్యంగా తెలంగాణ న్యూస్ చానెల్ వీ6 రెండో స్థానానికి ఎగబాకడం.. ఎన్టీవీ, టీవీ5 దిగజారడం మీడియా వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.

*ఎప్పటిలానే టీవీ9 ఫస్ట్..
తాజాగా జీఆర్పీ రేటింగ్ లు విడుదలయ్యాయి. ఇందులో శరామామూలుగానే టీవీ9 అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి దానిదే అగ్రస్థానం. ఒకటిరెండు సార్లు అటూ ఇటూ అయినా ఎప్పటి నుంచో తెలుగు న్యూస్ చానెల్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఇప్పుడు అదే నంబర్ 1లో కొనసాగుతోంది. విశేషం ఏంటంటే.. ఈ చానెల్ రేటింగ్ అందనంత ఎత్తులో ఉంది. దీనికి దరిదాపుల్లో ఆంధ్రా చానెల్స్ ఏవీ లేకపోవడం విశేషం. దీని తర్వాత రెండో స్థానంలో తెలంగాణ న్యూస్ చానెల్ వీ6 ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

*ఆంధ్రా చానెళ్ల పరిస్థితి మరీ ఘోరం
తాజాగా జీఆర్పీ రేటింగ్ లో టీవీ9 367.78 రేటింగ్ తో తొలి స్థానంలో ఉండగా.. దాని తర్వాత వీ6 272.96 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో తెలంగాణ న్యూస్ చానెల్ టీన్యూస్ 156.48 రేటింగ్ తో ఉంది. ఇక మొన్నటివరకు టీవీ9తో పోటాపోటీగా కొద్ది పాయింట్ల దూరంలోనే ఉన్న ఎన్టీవీ, టీవీ5 చానెల్ లు బాగా వెనుకబడడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఏకంగా ఎన్టీవీ 4వ స్థానంలో 108 పాయింట్లతో, టీవీ5 5వ స్థానంలో 90.94 పాయింట్లతో పరిమితమయ్యాయి. ఇక న్యూస్ పత్రికలను నడుపుతున్న ఈటీవీ 7వ స్థానంలో, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 8వ స్థానంలో సాక్షి చానెల్ అయితే 10వ స్థానానికి దిగజారింది.

*ఎన్టీవీ, టీవీ5 వెనుకబాటుకు కారణమేంటి?
టీవీ9తో పోటాపోటీగా మొన్నటి వరకు పోటీపడ్డ ఎన్టీవీ, టీవీ5 రేటింగ్ లో దిగజారాయి. హైదరాబాద్ లో ఉన్న ఇవి ఎక్కువగా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వార్తలనే వండి వారుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు కూడా చూడడం లేదట.. హైదరాబాదీలంతా తెలంగాణకు సంబంధించిన వార్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారు తెలంగాణలో ఉండడంతో ప్రథమ ప్రాధాన్యం వాటికే ఇస్తున్నారు. అందుకే ఆంధ్రా వార్తలను ప్రసారం చేస్తున్న సదురు చానెళ్లను తిరస్కరిస్తున్నారు.

*దిగ్గజాలున్న ఆంధ్రాచానెళ్లకు ఇది అవమానామే..
ఎంత సేపు భజన.. అనవసర వివాదాలు.. ఆంధ్రా వార్తలను ఎక్కువగా ప్రసారం చేయడమే ఆంద్రా చానెళ్లు అయిన ఎన్టీవీ, టీవీ5, ఎబీఎన్, సాక్షి వెనుకబాటుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే దానిపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా అన్నింటిని ఇస్తూ వార్తలను వార్తలు చూపిస్తున్నందునే టీవీ9, వీ6 చానెళ్లకు ఆదరణ దక్కుతోందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఆంధ్రా వార్తలకే ప్రాధాన్యం ఇస్తే ఆ చానెళ్ల పరిస్థితి ఘోరంగా తయారవుతుందని రేటింగ్ చూస్తే అర్థమవుతోంది. సదురు చానెల్స్ తమ తీరు మార్చుకుంటే మనుగడ సాగిస్తాయి.. లేదంటే ఈ రేటింగ్ పతనం ఇంకా పెరిగే చాన్స్ ఉంది.

-నరేశ్ ఎన్నం