ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజే పది లక్షల వ్యాక్సినేషన్ చేశామని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో హోరెత్తిన వార్త ఇది. నిజం చెప్పాలంటే దీని వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఆదివారం ఒక రోజే ఏపీలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య13,26,271 గా నమోదైంది. ఒక రాష్ర్టం ఇన్ని వ్యాక్సిన్లు వేయడం రికార్డే. దీని గురించి జగన్ సర్కారు మద్దతుదారులు గొప్పలు చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియాలో దీనిపై హోరెత్తిస్తున్నారు. కానీ ఈ రికార్డు సాధించడం వెనుక ఓ వైఫల్యం కూడా దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. గత కొన్ని రోజుల నుంచి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోంది. ఆదివారం రికార్డు కోసం మిగతా రోజుల్లో టీకాలు వేయడం తగ్గించినట్లు తెలుస్తోంది. వారం రోజుల ముందు నుంచి తగ్గించి ఆదివారం ఒక్క రోజే వాటిని వేసేందుకు సిద్ధమైనట్లు కొవిడ్ యాప్ లో డేటాను పరిశీలిస్తే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఆదివారానికి ముందు నాలుగు రోజులు కలిపి ఏపీలో వేసిన వ్యాక్సిన్లు కనీసం లక్ష కూడా లేవు. మొత్తంగా 90 వేల లోపే వేశారు. కానీ ఆదివారం మాత్రం అనూహ్య స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆదివారం 1.40 లక్షల టీకాలు వేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో రాష్ర్టానికి సరిపడ వ్యాక్సిన్లు రాక అంత తక్కువగా జరిగిందా? లేక అప్పుడు కావాలనే వ్యాక్సిన్లు తగ్గించి ఆదివారం వేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక్క రోజులో 13 లక్షల వ్యాక్సిన్లతో రికార్డు నెలకొల్పడం ద్వారా ఏం సాధిస్తారనేదే ప్రశ్న. ఒక్క రోజు దేశం మొత్తం ఇటు చూస్తే సరిపోతుందా? ముందు రోజుల్లో అంత తక్కువగా వ్యాక్సినేషన్ వేసి ఒక్క రోజే ఇన్ని వ్యాక్సిన్లు వేశామని చెప్పుకోవడంలో విశేషమేముందోనని పలువురు ప్రశ్నిస్తున్నారు.