మున్సిపోల్స్: ఏ పార్టీ ఎక్కడ గెలిచింది.. ఎక్కడ ఓడింది?

చంద్రబాబు, సోము వీర్రాజు, జనసేన నేతలు ఎంత రోడ్ల మీదకొచ్చి గొంతులు చించుకున్నా ఓట్లు రాలలేదు. ఏపీ సీఎం జగన్ అమరావతి కదలకుండా.. కనీసం ఒక్క పిలుపు కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చుంటే ఆయనకే ప్రజల బ్రహ్మరథం పట్టారు. నిజానికి అభివృద్ధి కోణంలో అధికార పార్టీకే ప్రజలు పట్టం కడుతారు. అది కామన్. కానీ ఇంతలా ఏకపక్ష విజయాన్ని అందించి జగన్ పార్టీని నెత్తిన పెట్టుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. ఆఖరుకు చంద్రబాబు ప్రచారం చేసిన చోట కూడా […]

Written By: NARESH, Updated On : March 15, 2021 8:49 am
Follow us on

చంద్రబాబు, సోము వీర్రాజు, జనసేన నేతలు ఎంత రోడ్ల మీదకొచ్చి గొంతులు చించుకున్నా ఓట్లు రాలలేదు. ఏపీ సీఎం జగన్ అమరావతి కదలకుండా.. కనీసం ఒక్క పిలుపు కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చుంటే ఆయనకే ప్రజల బ్రహ్మరథం పట్టారు. నిజానికి అభివృద్ధి కోణంలో అధికార పార్టీకే ప్రజలు పట్టం కడుతారు. అది కామన్. కానీ ఇంతలా ఏకపక్ష విజయాన్ని అందించి జగన్ పార్టీని నెత్తిన పెట్టుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. ఆఖరుకు చంద్రబాబు ప్రచారం చేసిన చోట కూడా టీడీపీ ఓడిపోవడం ఆ పార్టీని చావు దెబ్బ తీసినట్టైంది.

విశేషం ఏంటంటే.. అమరావతిపై రెఫరెండంగా భావించి ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుందని భావించిన గుంటూరు, విజయవాడల్లోనూ వైసీపీ గెలవడంతో ‘అమరావతి కథ’ ముగిసినట్టైనని తెలుస్తోంది. దీన్ని బట్టి వైసీపీ ఎన్నికల వ్యూహాలు ఎంత పకడ్బందీగా సాగాయో.. విజయవాడ, గుంటూరు, విశాఖలో ఎంతగా ఫోకస్ చేశారో అర్థమవుతోంది. తాడిపత్రి, మైదుకూరుల్లో తప్ప ఏపీలోని అన్ని మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకొని దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది.

*టీడీపీ తేలిపోయింది..
ఏపీ వ్యాప్తంగా బలమైన క్యాడర్, నేతలు ఉన్న టీడీపీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోవడం కలకలం రేపుతోంది. అణచివేత, అంగబలం, పోలీసు నిర్బంధాలతో ఓడిపోయామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పోటీచేసిన టీడీపీ.. తాడిపత్రి, మైదుకూరుల్లో మాత్రమే గెలిచింది. కొంతవరకు నర్సీపట్నం, బొబ్బిలిలో సత్తా చాటింది.

*జనసేన బోణీ కొట్టింది..
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన బరిలోకి దిగింది. రాష్ట్రంలో 320 వార్డుల్లో పోటీచేసింది. 18 వార్డుల్లో విజయం సాధించింది. 10 మున్సిపాలిటీల్లో బోణి కొట్టింది. అమలాపురంలో 6 వార్డులు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. నిడదవోలులో 4, విశాఖ కార్పొరేషన్ లో 3 డివిజన్లను గెలుచుకుంది. గుంటూరులో 2 చోట్ల, ఒంగోలు, మచిలీపట్నంలో ఒక్కో డివిజన్ గెలుచుకుంది.

*బీజేపీ పరిమితం..
మున్సిపాల్ ఎన్నికల్లో బీజేపీ 7 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది.కొవ్వూరు, హిందూపురం, గూడూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో రెండేసి చొప్పున వార్డులను బీజేపీ గెలుచుకుంది. విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతున్న విశాఖ పట్నం కార్పొరేషన్ లో ఒక డివిజన్ గెలుచుకోవడం విశేషం.

-వామపక్షాలు 6 స్థానాల్లో విజయం
వామపక్షాల అభ్యర్థులు 3 వార్డులు, 3 డివిజన్లలో విజయం సాధించారు. సీపీఐ 3 వార్డులు, ఒక డివిజన్ గెలుచుకోగా.. సీపీఎం రెండు డివిజన్లు గెలుచుకోగలిగింది. విశాఖలో సీపీఐ, సీపీఎంలు ఒక్కో డివిజన్ గెలిచాయి. విజయవాడలో సీపీఎం ఒక స్థానంలో గెలుపొందింది. గుంతకల్, తాడిపత్రి, డోన్ లలో ఒక్కో వార్డులో సీపీఐ గెలిచింది.