కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తిరుగులేని ప్రజాబలం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. ఎంత మంది వచ్చినా.. కుప్పంలో టీడీపీ అధికార బలం ఎక్కువగానే ఉంటుంది.
అయితే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పట్టు.. కనిపించలేదు. ఎక్కడా తన ప్రభావాన్ని చూపించినట్లు అనిపించలేదు. కుప్పం మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 25 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం ఆరు వార్డులను మాత్రమే గెలుచుకుంది. 19 స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ కుప్పం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది.
చంద్రబాబు సొంత నియోజకవర్గం కావటంతో అక్కడ ఎలాగైనా గెలవాలని టీడీపీ అధినేత చివరి వరకు ప్రయత్నాలు చేశారు. అతడికి తోడు నారా లోకేష్ తో పాటు పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దింపారు. వైసీపీ నుంచి మాత్రం కుప్పంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని చేశాడు.
అనుకున్నట్లుగానే అతడు తన లక్ష్యాన్ని చేరాడు. 19 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. కేవలం ఆరు వార్డుల్లో అంటే.. 5, 11, 18, 19, 20, 22, వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. ఇది చంద్రబాబు నాయుడుకి గట్టి దెబ్బే అని చెప్పాలి. దీనిపై సజ్జల మీడియాతో ఇలా మాట్లాడారు. కుప్పం ప్రజలు బాబుకు దండం పెట్టారనే.. తుది వీడ్కోలు పలికారని.. కుప్పంలో టీడీపీ కనుమరుగై పోయిందని ఎద్దేవా చేశారు.