Telangana Elections: ఏపీ టు తెలంగాణ.. ఖమ్మంకి చేరినవి ఆంధ్రా నోట్ల కట్టలేనా?

తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కడికి అక్కడే నగదు పట్టుపడుతోంది. హైదరాబాద్ శివార్లలో కార్లలో తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది. పక్కా సమాచారం అందడంతో పోలీసులు పట్టుకున్నారు.

Written By: Neelambaram, Updated On : November 20, 2023 5:02 pm
Follow us on

Telangana Elections: తెలంగాణ ఎన్నికలను ఏపీ సొమ్ము శాసిస్తోందా? అక్కడ ఓటును కొనుగోలు చేసేందుకు.. ఇక్కడి నుంచి నగదు వెళ్తుందా? తెలంగాణలో పట్టుబడుతున్న నగదు మూలాలు ఏపీలో ఉన్నాయా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ శివార్లలో పట్టుబడిన రూ.7.40 కోట్ల ఏపీకి చెందినవేనని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అది నిజమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కడికి అక్కడే నగదు పట్టుపడుతోంది. హైదరాబాద్ శివార్లలో కార్లలో తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది. పక్కా సమాచారం అందడంతో పోలీసులు పట్టుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ నగదుకు సంబంధించి పదిమందికి నోటీసులు ఇచ్చారు. వీరంతా ఖమ్మం జిల్లాకు చెందిన వారు కావడం, ఆపై కాంగ్రెస్ నేత పొంగులేటి బంధువులు కావడం గమనార్హం. అంతకుమించి ఈ నగదు అంతా ఏపీ నుంచి వెళ్లిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఏపీ ప్రభుత్వంలో కొన్ని అస్మదీయ కంపెనీలకే పనులు దక్కుతున్నాయి. అందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలు ఉన్నాయి. ఇసుక సీనరేజ్ వసూలు, స్మార్ట్ మీటర్లతో పాటు ఎన్నో రకాల ప్రాజెక్టులను పొంగులేటి కంపెనీలే దక్కించుకున్నాయి. పనులు కాకుండానే ఈ కంపెనీలకు బిల్లులు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెల్లింపులు చేస్తున్న నగదునే పొంగులేటి తెలంగాణ ఎన్నికల్లో పెట్టుబడి పెడుతున్నారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. పొంగులేటిని ముందు పెట్టుకుని జగన్ ఒక తరహా ప్రయోగం చేస్తున్నారన్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈ అనుమానాలకు నిజం చేస్తున్నట్లు పొంగులేటి బంధువులకు చెందిన నగదు పట్టుపడుతుండడం విశేషం.

జగన్ కు కెసిఆర్ ఆప్తమిత్రుడు. కానీ అదే కేసీఆర్ పార్టీ నుంచి పొంగులేటి బయటకు వచ్చారు. ఏకంగా తాడేపల్లి వచ్చి జగన్ తో చర్చలు జరిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ స్పాన్సర్ చేస్తున్నారన్న ప్రసారం ఉంది. పొంగులేటి వెనుక జగన్ ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. పైగా పొంగులేటి వైయస్ కుటుంబానికి ఆప్తమిత్రుడు. పాలేరులో శీనన్న పోటీ చేస్తే.. తాను ఎలా ప్రత్యర్థినవుతానని చెప్పి మరీ షర్మిల.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. పొంగులేటి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే పొంగులేటి బంధువులకు చెందిన నగదు పట్టుపడితే.. అది ఏపీ నుంచి వచ్చింది గాక.. మరి ఏమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలంగాణ పోలీసులు దీనిని నిరూపిస్తారా? లేకుంటే నీరుగారుస్తారా? అన్నది చూడాలి.